కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ లాక్ లో భాగంగా థియేటర్లు తెరిచినా.. జనాలు మాత్రం థియేటర్ల వంక చూడడం లేదు. ప్రస్తుత కాలంలో థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడాల్సిన అవసరం లేకుండా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఓటీటీల ద్వారా దొరుకుతుండడంతో ప్రేక్షకులను మళ్లీ థియేటర్ బాట పట్టించాలంటే కష్టమే. దేశంలో కొన్ని మల్టీప్లెక్స్ లు తెరుచుకున్నాయి.. వాటికి కనీసపు ఆదాయం కూడా రావడం లేదు. కొన్ని రోజుల్లో తెలంగాణాలో థియేటర్లకు అనుమతులు రాబోతున్నారు.
డిసెంబర్ నాటికి థియేటర్లు పూర్తిగా తెరుచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఎలా అనే విషయంలో చిత్రసీమ మల్లగుల్లాలు పడుతోంది. జనవరి లో కొత్త సినిమాలు వచ్చేస్తాయి. సంక్రాంతికి అసలైన హడావిడి మొదలవుతుంది. కొత్త సినిమాలు చూడడానికి అయినా.. ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ముందుగా ప్రేక్షకులకు సినిమాని, థియేటర్ వాతావరణాన్ని మళ్లీ అలవాటు చేయాలి. దీనిలో భాగంగా కొన్నిరోజుల పాటు సినిమాను ఉచితంగా ప్రదర్శించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కనీసం రెండు వారాల పాటు తెలంగాణలోని కొన్ని థియేటర్లలో సినిమాలని ఉచితంగా ప్రదర్శించాలని.. టికెట్ లేకుండా ఎంట్రీ ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం, పంపిణీదారులు భావిస్తున్నారు. ఇప్పుడు సినిమా వేసినా లాభాలు లేవు. అందుకే ఫ్రీగా సినిమా చూపిస్తే.. కనీసం అప్పుడు అయినా జనాలు థియేటర్లకు అలవాటు పడతారనేది సినిమా వాళ్ల నమ్మకం. త్వరలోనే తెలంగాణాలో థియేటర్లు ఓపెన్ చేసి.. ముందుగా ‘వి’, ‘నిశ్శబ్దం’, ‘మిస్ ఇండియా’ లాంటి సినిమాలను ఫ్రీగా చూపించాలని భావిస్తున్నారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!