“బ్రోచేవారెవరురా” లాంటి సూపర్ హిట్ తర్వాత శ్రీవిష్ణు నటించగా విడుదలైన చిత్రం “తిప్పరా మీసం”. భిన్నమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. మరి సినిమా కూడా అదే స్థాయిలో అలరించిందో లేదో చూద్దాం..!!
కథ: స్కూల్ వయసు నుంచే డ్రగ్స్ కి అలవాటుపడి.. తల్లి (రోహిణి) బలవంతంగా రిహేబ్ సెంటర్ లో చేర్పించగా అక్కడ పరిణితి చెండాల్సిందిపోయి.. మరింత రాటుదేలిపోయి సమాజంలోకి అడుగుపెడతాడు మణి (శ్రీవిష్ణు). డ్రగ్స్, తాగుడు, అమ్మాయిలు, క్రికెట్ బెట్టింగులు, గొడవలు ఇలా మణికి లేని చెడు బుద్ది అంటూ ఉండదు. ఒక సందర్భంలో క్రికెట్ బెట్టింగ్ లో 30 లక్షలు అప్పుకు గురవుతాడు. ఆ అప్పు తీర్చే ప్రయత్నంలో తల్లిని కోర్టుకీడుస్తాడు.
ఈ పరిస్థితుల నుండి మణి ఎలా బయటపడ్డాడు అనేది “తిప్పరా మీసం” కథ.
నటీనటుల పనితీరు: శ్రీవిష్ణు ఈ చిత్రంలో కొత్తగా కనిపించాడు. అతడి స్టైలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. కాకపొతే.. ఫ్రస్ట్రేటడ్ యూత్ పాత్రలో శ్రీవిష్ణు యాటిట్యూడ్ కి ఒక పెక్యులారిటీ లేకుండాపోయింది. అందువల్ల చాలా సన్నివేశాల్లో విజయ్ దేవరకొండను ఇమిటేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు శ్రీవిష్ణు.
నిక్కీ తంబోలి క్యారెక్టర్ ను కానీ క్యారెక్టరైజేషన్ ను కానీ పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు.అమ్మ పాత్రలో రోహిణి ఎప్పట్లానే సహజంగా ఆకట్టుకొంది. రవివర్మ, రవిప్రకాష్, బెనర్జీ, నవీన్ నేనిలు వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: “బ్రోచేవారెవరురా” లాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ తర్వాత శ్రీవిష్ణుని కంప్లీట్ సీరియస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులకు ప్రెజంట్ చేయాలనుకోవడం మంచిదే. అయితే.. క్యారెక్టరైజేషన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది దర్శకుడు. శ్రీవిష్ణు క్యారెక్టర్ కి ఒక ఆర్క్ అనేది ఉండదు. ఎంత చెడ్డవాడైనా సరే ఎదో ఒక పాయింట్ లో ఎందుకు రియలైజ్ అవ్వడు, ఎందుకని తన తల్లిని అంతగా ద్వేషిస్తాడు అనే వాటికి ఇంకాస్త డెప్త్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రాసుకొంటే బాగుండేది. స్పాయిల్ట్ కిడ్ స్టోరీస్ ఇప్పటికే చాలా చూసాం.. “తిప్పరా మీసం”లో నాయకుడి యాటిట్యూడ్ కానీ.. అతడి సమస్యలు, ఆ సమస్యలను అతడు డీల్ చేసే విధానం కానీ ప్రేక్షకులకు ఎలాంటి కొత్త భావన కలిగించవు. అందువల్ల దర్శకుడిగా, కథకుడిగా కృష్ణ విజయ్ ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
సురేష్ బొబ్బిలి సంగీతం, నేపధ్య సంగీతం కొత్తగా ఉన్నాయి. సిడ్ సినిమాటోగ్రఫీ, షర్మిల యాలిశెట్టి ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగున్నాయి.
విశ్లేషణ: కోపం అనేది వెండితెరపై ప్రెజంట్ చేయదగ్గ అద్భుతమైన ఎమోషన్. ఈ ఎమోషన్ ను బేస్ చేసుకొనే “అర్జున్ రెడ్డి” అఖండ విజయం సాధించింది. ఆ ఎమోషన్ కు మంచి కథ-కథనం జోడించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దాంతో “తిప్పరా మీసం” ఒక యావరేజ్ & బోరింగ్ సినిమాగా మిగిలిపోయింది.