కమెడియన్ గా నటిస్తున్నప్పుడు రోజుకి మూడు షెడ్యూల్స్ చేస్తూ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు హీరో అయ్యాక ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నాను. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా చేస్తున్న సినిమాలు ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్నాను. అయితే.. ఇకనుంచి హీరోగా నటిస్తూనే భారీ చిత్రాల్లో కమెడియన్ రోల్స్ ప్లే చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాను అంటున్నారు సునీల్. ఆయన తాజా చిత్రం “2 కంట్రీస్” డిసెంబర్ 29న విడుదలవుతోంది. ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. “ఉంగరాల రాంబాబు” ఫెయుల్యూర్ తో కాస్త ఢీలాపడిన సునీల్ “2 కంట్రీస్”పై భారీ అంచనాలు పెట్టుకొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు.
నా కెరీర్ లో నాలుగో రీమేక్..
“అందాల రాముడు, పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు” చిత్రాల తర్వాత నేను నటిస్తున్న నాలుగో రీమేక్ ఇది. ఇప్పటివరకూ నాకు రీమేక్ లు బానే అచ్చోచ్చాయి. “2 కంట్రీస్” కూడా అదే విధంగా వర్కాటవుతుందని ఆశిస్తున్నాను. అయితే.. ఈమధ్యకాలంలో ఎన్నడూలేని విధంగా “2 కంట్రీస్” సినిమాకీ మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. 2017 చివర్లో, 2018 మొదట్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండే హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ “2 కంట్రీస్” మాత్రమే.
ఆ సినిమా హిట్ అని చెప్పినా నమ్మడం లేదు..
“ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు” సినిమాలు ఫ్లాపైన విషయం తెలిసిందే, నేను ఒప్పుకొంటాను. కానీ.. “జక్కన్న” 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే నాకు పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి.. ఇప్పుడు ఆ సినిమా హిట్ అని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు.
శంకర్ ఆ సబ్జెక్ట్ చెబితే షాక్ అయ్యాను..
ఎన్.శంకర్ గారి సినిమాలంటే ఆలోచనాత్మకంగా, సందేశాత్మకంగా ఉంటాయి. అలాంటిది ఆయన వచ్చి కామెడీ సినిమా తీద్దామని చెప్పినప్పుడు షాక్ అయ్యాను. కానీ.. మలయాళం వెర్షన్ ను చూశాక శంకర్ గారైతేనే న్యాయం చేస్తారనిపించింది. అందుకే ధైర్యంగా దిగాను.
అప్పుడు చెప్పరు.. ఇప్పుడు చెబుతారు
నేను “అందాల రాముడు” సినిమా అప్పట్నుంచి స్క్రిప్ట్స్ లో వేళ్ళు, కాళ్ళు, తలకాయ్ కూడా పెట్టేసేవాడ్ని. హిట్టయిన సినిమాలకు ఎప్పుడూ ఎవరూ నా ఇన్వాల్వ్ మెంట్ ఉందని చెప్పలేదు. కానీ.. ఫ్లాపైతే మాత్రం నేను తెగ కెలికేసానని చెప్పేస్తారు. సో అలాంటి విషయాల గురించి నేను అస్సలు పట్టించుకోను.
ఆ సినిమాకి త్రివిక్రమ్ ఫ్రీగా వర్క్ చేసేవాడు..
నాకు త్రివిక్రమ్ తో ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రైటర్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కేవలం నా మీద అభిమానంతో “అందాల రాముడు” సినిమాకి ఫ్రీగా వర్క్ చేశాడు. నిజానికి అప్పటికి త్రివిక్రమ్ సినిమాకి రెండు కోట్లు తీసుకొంటున్నాడు.
సినిమా స్పాన్ తగ్గిపోయింది..
ఇదివరకూ సినిమాలంటే పెద్ద కుటుంబం, పెద్ద కథ, కథలో బోలెడు మంది పాత్రధారులు వారికి పెద్ద స్కోప్ ఉండేది. ఇప్పుడేమో ఇద్దరు మనుషులు నాలుగు సందులు తిరిగితే కథ అయిపోతుంది. దానికి ప్రయోగం అని పేరు పెట్టుకొని సినిమాలు తీసేస్తున్నారు. అందువల్ల మునుపటిలా లాంగ్ స్పాన్ ఉన్న సినిమాలు ఈమధ్య రావడం లేదు.
కామెడీ డైరెక్టర్లు తగ్గిపోయారండీ..
నేను, అల్లరి నరేష్ లాంటి హీరోలు ఈమధ్య సినిమాలు సరిగా చేయలేకపోవడానికి, హిట్ పర్సంటేజ్ తగ్గిపోవడానికి కారణం ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు తీసే దర్శకులు తగ్గిపోవడమే. అందరూ కాన్సెప్ట్ సినిమాల మీద పడితే కామెడీ సినిమాలు ఎవరు తీస్తారు చెప్పండి. అందుకే ఈమధ్య కామెడీ సినిమాలు రావట్లేదు.
3 సినిమాలు హీరోగా.. 3 సినిమాలు కమెడియన్ గా
2018లో హీరోగా ఒక మూడు సినిమాలు ఆల్రెడీ సైన్ చేశాను. వాటి వివరాలు జనవరిలో వెల్లడిస్తాను. అలాగే మూడు భారీ చిత్రాల్లోనూ కామెడీ రోల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాను. వాటి వివరాలు మాత్రం నన్నడగకండి.