తెలుగు సినిమాకు అతి పెద్ద సీజన్ ‘సంక్రాంతి’. ఇది ఏటా చెప్పుకునే మాట. ‘పెద్ద’ అనే ఫీల్‌కి తగ్గట్టే పెద్ద పెద్ద హీరోలు ఆ సంక్రాంతికి తమ సినిమాలనే పందెం కోళ్లతో వచ్చి పోటీ పడుతుంటారు. అందులో ఒకటో, రెండో కోళ్లు గెలుస్తాయి. ఇటీవల కాలంలో మాకు గుర్తున్నంత వరకు సంక్రాంతికి 2017లో గరిష్ఠంగా నలుగురు హీరోలు వచ్చారు. అయితే వచ్చే సంక్రాంతికి ఈ సంఖ్య తొమ్మిదికి చేరుతుందా… బయటికొస్తున్న సినిమాల లెక్క చూస్తే అంతే అనిపిస్తోంది.
సూపర్‌స్టార్లు, మల్టీస్టార్లు, యంగ్ హీరోలు… ఇలా అందరూ కలిపి ఓ తొమ్మిది మంది హీరోలు తమ సినిమాలతో సంక్రాంతి సీజన్‌పై దండయాత్ర చేయడానికి వస్తున్నారు. వీరిలో ఎంతమంది బరిలో నిలుస్తారు, ఎంతమంది ముందు, వెనుక అయిపోతారు అనేది పోను పోను తెలుస్తుంది. ఇప్పటికి పెద్ద పండగ పోటీలో ఉన్నవారి లిస్ట్ అయితే చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, రానా, నాగచైతన్య, వరుణ్‌తేజ్. ఇదీ సంక్రాంతి పందెం కోళ్ల జాబితా.
వచ్చే సంక్రాంతి సీజన్‌ను స్టార్ట్ చేసేది పవన్ కల్యాణ్ – రానా అనిచెప్పొచ్చు. వారిద్దరి కలయిలో వస్తున్న ‘అయ్యప్పనుమ్ కొశియమ్’ రీమేక్‌ను జనవరి 12న విడుదల చేస్తారట. ఆ తర్వాత సూపర్‌స్టార్ ఎంట్రీ ఇస్తాడు. ‘సర్కారు వారి పాట’తో జనవరి 13న మహేష్ రంగంలోకి దిగుతాడు. 14న ‘రాధేశ్యామ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ మూడు సినిమాల తేదీలే అఫీషియల్‌గా బయటికొచ్చాయి. మిగిలిన సినిమా తేదీలు రానప్పటికీ సంక్రాంతి సీజన్‌నే నమ్ముకున్నాయి.
వెంకటేశ్ – వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్ 3’ని సంక్రాంతికే వస్తుంది. అయితే డేట్ కన్ఫామ్ కాలేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ ఈ నెల 20న ప్రారంభమవుతుంది. దీనిని కూడా సంక్రాంతికి తీసుకురావాలని చూస్తున్నారు. అదే చేస్తే నాగార్జున, నాగచైతన్య సంక్రాంతికే వస్తారు. ‘లూసిఫర్’ రీమేక్‌ను సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి తీసుకురావాలనే ఆలోచన చిత్రబృందం చేస్తోంది. అలా చిరంజీవి సంక్రాంతికి రెడీ.