ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. ఏ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారో..? దేని మీద బజ్ లేదో ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2022లో ‘కేజీఎఫ్2’, ‘ఆర్ఆర్ఆర్’ ఈ రెండు డబ్బింగ్ సినిమాలే బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ బడ్జెట్ సినిమా కూడా ఐదొందల కోట్ల మార్క్ చేరుకోలేకపోయింది.
ఇక మిగిలిన సినిమాల పరిస్థితి ఊహించలేం కూడా. ఈ నెల 25న వరుణ్ ధావన్ నటించిన ‘భేడియా’ సినిమా రిలీజ్ కానుంది. తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై జనాల్లో హైప్ లేదు. దీంతో ఓపెనింగ్స్ విషయంలో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. కొత్త ఆఫర్లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా బుక్ మై షోతో టైఅప్ చేసుకున్నారు. దాని ప్రకారం..
175 రూపాయలు పెట్టి ఒక ఓచర్ కొంటే ‘భేడియా’ టికెట్లు బుక్ చేసుకునేప్పుడు 350 రూపాయలు మనకి వెనక్కి వస్తాయి. అంటే సినిమాను ఫ్రీగా చూడొచ్చన్నమాట. కాకపోతే ఈ ఓచర్ ని 20వ తేదీలోపు కొనాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ను బట్టి వసూళ్ల కోసం ఎన్ని స్ట్రాటెజీలు వేయాల్సి వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ‘భేడియా’ హారర్ కామెడీ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించారు.
ఒక మనిషి తనకు తెలియకుండా తోడేలుగా మారిపోయే కాన్సెప్ట్ ఇది. బాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం ‘జునూన్’ అనే సినిమా వచ్చింది. ఇది కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది. దానికి కొంచెం ఎంటర్టైన్మెంట్ టచ్ ఇచ్చి ‘భేడియా’ను రూపొందించారు. ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటించింది.