వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల థియేటర్స్ కూడా మూతపడిన సంగతి తెలిసిందే.ఎన్నో సినిమాల షూటింగ్ లకు కూడా బ్రేక్ పడింది. రెండు నెలల తర్వాత షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. వైరస్ మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్ లు తిరిగి మొదలుపెట్టడానికి దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా వెనకడుగు వేస్తున్నారు. సరే ఇవన్నీ పక్కన పెట్టి థియేటర్స్ అయినా.. ఓపెన్ అవుతాయా అంటే.. ఇప్పట్లో అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఓటిటిలో విడుదల చేయమంటూ ఆ సంస్థల అధినేతలు నిర్మాతల వెంట తిరుగుతున్నారు. అయితే పెట్టిన బడ్జెట్ కు.. ఓటిటి సంస్థలు చెప్పే రేట్ కు సంబంధం లేకపోవడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు.. మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ‘క్రాక్’ చిత్రం కూడా ఓటిటిలో విడుదలవుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తుంది. గత 3ఏళ్ళుగా సరైన హిట్ లేని రవితేజ.. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘క్రాక్’ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నట్టు సమాచారం. అందులోనూ ‘క్రాక్’ కు సంబంధించి.. ఓ చిన్న షెడ్యూల్ ను కూడా ఫినిష్ చెయ్యాల్సి ఉంది.తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఉంటాయని వారు తెలిపారట.