సోషల్ మీడియా రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు కొందరు నెటిజన్లు. నేరుగా సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉండడంతో వాళ్ళను ట్యాగ్ చేసి లేని పోని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళను.. కొందరు ఆకతాయి మూక చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. ముఖ్యంగా హీరోయిన్లు ఏదైనా కొత్త ఫోటోలను షేర్ చేసినా… లేదా లైవ్ లోకి వస్తే.. అసభ్యకరమైన ప్రశ్నలు, కామెంట్లు చేస్తూ విరుచుకుపడుతున్నారు.
వాళ్ళు సామజిక అంశాల పై స్పందించినా..కొందరు నెటిజన్లు వల్గర్ కామెంట్స్ చేస్తూ వాళ్ళు సహనం కోల్పోయేలా చేస్తున్నారు. ఇది పక్కన తాజాగా ఓ టాలీవుడ్ నటి ఫోటోలను డేటింగ్ యాప్ లో పెట్టి వేధింపులకు గురి చేశారు కొందరు ఆకతాయిలు. వివరాల్లోకి వెళితే.. పలు టాలీవుడ్ సినిమాల్లో నటించిన గీతాంజలి అలియాస్ ఫ్రూటీకి ఆన్లైన్ వేధింపులు ఎదురయ్యాయట. కొంతమంది ఆమె ఫోటోలను ఓ డేటింగ్ యాప్ లో పెట్టడంతో ఈమెకు అసభ్యకరమైన కాల్స్ వస్తున్నట్టు స్పష్టమవుతుంది.
ఆ కాల్స్ ఎక్కువవడంతో చివరికి విసిగిపోయి.. ఈమె పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ‘డేటింగ్ యాప్ లో నా ఫోటోలు పెట్టి నన్ను వేధిస్తున్నారు.. నాకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు’ అంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈమె కంప్లైంట్ ను స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న సింగర్ మధుప్రియ కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వలన ఇబ్బంది పడినట్టు తెలియజేసిన సంగతి తెలిసిందే.