కోలీవుడ్ హీరోల సినిమాలను తెలుగు ప్రజలు బాగా ఆదరిస్తారు. రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్, విక్రమ్, సూర్య, ధనుష్.. ఇలా చాలా మంది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లోను రికార్డులు సృష్టించారు. వారికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అక్కడ నిర్మాతలు, దర్శ కులు ముందుగానే ప్లాన్ చేసి ఏక కాలంలో రెండు భాషల్లో షూట్ చేస్తున్నారు. కొన్ని సీన్లకు తెలుగుదనం జోడించి కాసులు కొల్లగొడుతున్నారు. గతంలో టాలీవుడ్ హీరోలు ఆ విధంగా ఆలోచించలేదు. చిత్రం విజయం సాధిస్తే దానికి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేవాళ్లు. రీసెంట్ గా ఒకే సమయంలోనే వివిధ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
సాహసాలకు మారు పేరైన సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి అడుగు వేశారు. ద్వి భాష చిత్రంలో నటిస్తూ స్ఫూర్తి నిచ్చారు. కమర్షియల్ డైరక్టర్ ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న సినిమా ఏక కాలంలో తెలుగు తమిళ్ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తమిళ సినీ అభిమానులను నేరుగా పలకరించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో అల్లు అర్జున్. ఇతని గత చిత్రాలు తమిళనాడు, కేరళలో బాగా విజయం సాధించాయి. అవి డబ్బింగ్ అయినా అక్కడి ప్రజలు బాగా ఆదరించారు. ఇప్పుడు బన్నీ సికిందర్ ఫేమ్ లింగు స్వామి తో ద్వి భాషా చిత్రం చేయనున్నారు. జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ ద్వారా స్టైలిష్ స్టార్ పక్క రాష్ట్రాల్లో పాగా వేయనున్నారు. ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత చేసే మూవీ కూడా తెలుగుతో పాటు తమిళం, హిందీలో నిర్మితం కానుంది. మరికొంతమంది టాలీవుడ్ హీరో ఆ బాటలో నడవనున్నారు.