ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. రెండు రోజుల క్రితమే సీతారామశాస్త్రి అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిమ్స్ కి చెందిన డాక్టర్స్ ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. చేంబోలు సీతారామశాస్త్రి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు.
ఆయన ఎంఏ చదువుకుంటున్న సమయంలోనే సినిమా అవకాశం వచ్చింది. దర్శకుడు విశ్వనాధ్ రూపొందించిన ‘సిరివెన్నెల’ సినిమాకి మొత్తం పాటలు రాసే ఛాన్స్ సీతారామశాస్త్రికి వచ్చింది.మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకొని సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారాయన. గత దశాబ్దాలుగా తెలుగు సినిమాకు పాటల రచయితగా సేవలను అందిస్తున్నారు. ఇప్పటివరకు మూడువేలకు పైగా పాటలు రాశారు. అందులో దాదాపు అన్నీ హిట్ సాంగ్స్ అనే చెప్పాలి. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. అలానే నంది అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు.