స్పై సినిమాలు అంటే మనకు ప్రస్తుత రోజుల్లో గుర్తొచ్చే టాలీవుడ్ (Tollywood) హీరోలు అడివి శేష్ (Adivi Sesh) మాత్రమే. అదేంటి మిగిలిన హీరోలు ఎవరూ స్పై సినిమాలు చేయడం లేదా అంటే చేస్తున్నారు.. కానీ సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో కొన్ని రోజులకు స్పై సినిమాలు అంటే మిగిలిన హీరోల పేర్లు వినిపించని పరిస్థితి వచ్చేలా ఉంది. అసలు ఈ చర్చంతా ఎందుకు వచ్చింది అంటే ఇటీవల టాలీవుడ్‌లో వచ్చిన స్పై సినిమా ‘జాక్’ (Jack) ఫలితం తేడా కొట్టడమే.
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) – బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఇబ్బందికర ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో గూడఛారుల సినిమాలు అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ (Krishna). ఆయన అలాంటి రోల్స్‌లో చాలా సినిమాలు చేశారు. అయితే అవన్నీ దాదాపుగా సీరియస్‌గానే ఉంటాయి. కాస్త కామెడీ టచ్ ఇచ్చి చేసింది చిరంజీవి (Chiranjeevi). ‘చంటబ్బాయ్’ (Chantabbai) మీరు చూసే ఉటారు. ఆ తర్వాత హీరోలు ఆ తరహా ప్రయత్నం చేయలేదు.
చాలా ఏళ్ల తర్వాత ‘గూఢచారి’ అంటూ అడివి శేష్ వచ్చి వావ్ అనిపించాడు. ఆ వెంటనే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya) అంటూ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నవ్విస్తూనే థ్రిల్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన స్పై సినిమాలు ఏవీ అనుకున్నంత విజయం సాధించలేదు కాదు కదా.. ఓ మోస్తరు విజయాన్ని కూడా అందుకోలేదు. సీరియస్ టాపిక్ అయిన స్పైకి కాస్త వినోదం జోడించే క్రమంలో లైన్ అటు ఇటు దాటితే ఫలితం తేడా కొట్టేస్తుంది అని ‘జాక్’ సినిమా నిరూపించింది.
మరీ మూస ధోరణిలో, యాక్షన్ కోసం తీసేస్తే ఇబ్బంది అవుతుందని అఖిల్ (Akhil Akkineni) ‘ఏజెంట్’ (Agent) సినిమా చూపించింది. కథను బలంగా చెప్పకపోతే కష్టం అని నిఖిల్ (Nikhil Siddhartha) ‘స్పై’ (Spy) చెప్పింది. ఇంచుమించుగా కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘డెవిల్’ (Devil) పరిస్థితి కూడా ఇంతే. ఇక వెన్నెల కిషోర్ (Vennela Kishore) ‘ఛారి 111’ (Chaari 111), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ (Sreekakulam Sherlock Holmes) గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. తనకు గతంలో మంచి విజయం ఇచ్చిన ‘గూఢచారి’ (Goodachari) సీక్వెల్‌తో అడివి శేష్ త్వరలో రానున్నాడు. మరి ఆ సినిమా ఏమవుతుందో చూడాలి.