టాలీవుడ్ సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. థియేటర్లలో విడుదలయ్యే భారీ సినిమాలను పది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 6 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలను మాత్రం నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయవచ్చు. ఈ సినిమాల విషయంలో ఫెడరేషన్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై వర్చువల్ ప్రింట్ ఫీజు ఖర్చులను ఎగ్జిబిటర్లు చెల్లించాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని ప్రతిపాదనలు చేసింది. సి క్లాస్ సెంటర్లలో జీఎస్టీతో కలిపి టికెట్ ధరలు 100 రూపాయలు, 70 రూపాయలుగా ఉండాలని మల్టీప్లెక్స్ లలో అత్యధికంగా 150 ప్లస్ జీఎస్టీ ఉండాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదనలు చేసింది. నిర్మాణ వ్యయం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కౌన్సిల్, ఛాంబర్ నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలితో చర్చించిన తర్వాతే నిర్మాణ వ్యయాలను పెంచుకోవాలి.
నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న కో ఆర్డినేటర్లు, మేనేజర్ల వ్యవస్థను రద్దు చేయాలని నిర్మాతల మండలి సూచనలు చేసింది. కచ్చితమైన సమయ పాలన అమలు చేయాలని నిర్మాతల మండలి పేర్కొంది. ఈ విధంగా చేయడం వల్ల అనుకున్న సమయానికే షూటింగ్ లు పూర్తయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నటులు తమ అసిస్టెంట్లకు సౌకర్యాలు, వసతి కావాలని డిమాండ్ చేయడానికి వీలు లేదు.
హీరోలు, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ నుంచి ఈ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాల వల్ల టాలీవుడ్ కు మేలు జరుగుతుందేమో చూడాల్సి ఉంది. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఫాలో అవుతారో లేదో చూడాల్సి ఉంది.