టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ఓ సక్సెస్ ఫార్ములాను బాగా ఫాలో అవుతున్నారు. విలేజ్ మిస్టరీ జోనర్ లో సినిమాలు రూపొందిస్తూ మంచి హిట్స్ అందుకుని సత్తా చాటుతున్నారు. ఒక చిన్న గ్రామంలో ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి హీరోలను రంగంలోకి దింపుతున్నారు. ఊహించని క్లైమాక్స్ తో సినిమా ఎండ్ చేసి అదరగొడుతున్నారు. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA) మూవీని అలాంటి జోనర్ లోనే తెరకెక్కించారు కొత్త దర్శకులు సందీప్, సుజిత్.
మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడే క్రిష్ణగిరి అనే ఊర్లో పోస్ట్ మ్యాన్ విధుల్లో చేరిన హీరో.. ఓ లెటర్ ద్వారా చిక్కుల్లో పడతారు. ఆ ఊరిలో అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోవడానికి కారణమెవరోనన్న ఒక పాయింట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా తీసి.. ప్రేక్షకులను ఊహించని ట్విస్ట్ లతో అలరించారు. అంతకుముందు ఇలాంటి జోనర్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej).. విరూపాక్షతో (Virupaksha) సరైన టైమ్ లో సరైన హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా కథంతా రుద్రవనం అనే ఊరి చుట్టూ సాగుతోంది. ఊర్లలో చావుల వెనకున్న రహస్యాల్ని ఛేదించడానికి హీరో నడుం బిగించి అనుకున్నది సాధిస్తాడు. ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకున్న మా ఊరి పొలిమేరకు (Maa Oori Polimera) సీక్వెల్ గా వచ్చిన మా ఊరి పొలిమేర-2 (Maa Oori Polimera 2) సినిమా అంతా ఓ గ్రామంలో దాచి ఉన్న నిధి చుట్టూ తిరుగుతుంది. డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) తెరకెక్కించిన మంగళవారం (Mangalavaaram) మూవీ కూడా మహాలక్ష్మీపురంలో ఊర్లో జరిగే ఓ ఘటన చుట్టూ సాగుతుంది. మిస్టీక్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా మంచి హిట్ అయింది.
రివేంజ్ డ్రామాలా తెరకెక్కి ఓ చిన్న సందేశంతో ఎండ్ అయ్యి మెప్పించింది. మసూద (Masooda) మూవీ కూడా గ్రామంలోకి అందరినీ తీసుకెళ్లి ఓ రేంజ్ లో అలరించింది. యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఊరి పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమా అంతా మార్మిక ప్రపంచమైన భైరవకోన గ్రామం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. మంచి థ్రిల్ పంచుతూ ఆకట్టుకుంది. అయితే ఈ మధ్యే కాదు.. 80స్ లో వచ్చిన అన్వేషణ సినిమా కూడా ఓ గ్రామం చుట్టూ తిరుగుతుంది. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులతో మెప్పించింది. ఇప్పుడు క సినిమా కూడా విలేజ్ మిస్టరీ నేపథ్యంలో రూపొంది.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.