Tollywood: బాక్సాఫీస్‌కు మంచు గండం.. సంక్రాంతి సినిమాల జోరుకు బ్రేక్..
- January 27, 2026 / 12:48 PM ISTByFilmy Focus Writer
తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అంటేనే కాసుల వర్షం. అందుకే ఎంత పోటీ ఉన్నా మన హీరోలు పండగ బరిలో దిగడానికి సై అంటారు. ఈ ఏడాది కూడా ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ముఖ్యంగా ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ (నార్త్ అమెరికా) మార్కెట్‌లో కూడా ఈ సినిమాలు అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించి సత్తా చాటాయి.
Tollywood
తొలి వారంలో ఈ మూడు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద హై రేంజ్ వసూళ్లతో దూసుకుపోయాయి. దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తూ, బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అనుకున్న దానికంటే ముందే చేరుకున్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇవన్నీ ఇప్పటికే లాభాల్లోకి కూడా ప్రవేశించాయి. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ప్రకృతి ఊహించని షాక్ ఇచ్చింది. నార్త్ అమెరికాలో గత కొన్ని రోజులుగా మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. విపరీతమైన చలిగాలులు, మంచు కారణంగా అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ మంచు తుఫాను ప్రభావం మన సినిమాల వసూళ్లపై గట్టిగానే పడింది. రోడ్లన్నీ మంచుతో నిండిపోవడం, రవాణా వ్యవస్థ ఆగిపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో సంక్రాంతి సినిమాల కలెక్షన్ల దూకుడుకు అనూహ్యంగా బ్రేక్ పడింది. వాతావరణం అనుకూలించి ఉంటే ఈ వసూళ్లు మరో స్థాయిలో ఉండేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిట్టు టాక్ ఉన్నప్పటికీ, మంచు గండం వల్ల ఆశించిన స్థాయిలో అదనపు వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి.
ప్రస్తుత గణాంకాల ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ 3.3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. ఇక ‘అనగనగా ఒక రాజు’ 1.73 మిలియన్ డాలర్లతో త్వరలోనే 2 మిలియన్ క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా 7.4 లక్షల డాలర్లకు పైగా రాబట్టి మిలియన్ మార్క్ వైపు అడుగులు వేస్తోంది. ఏదేమైనా ఈ ప్రతికూల వాతావరణంలోనూ మన సినిమాలు ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గమనార్హం.
















