పైన చూసిన హెడ్డింగ్ లు కాస్త షాకిచ్చేలా ఉన్నా అవి నిజమే. ఓ తమిళ హీరోకి మన తెలుగు నిర్మాతలు అక్షరాలా రూ.20 కోట్లు పారితోషికం ఇస్తున్నారట.ఆ హీరో మరెవరో కాదు శివ కార్తికేయన్. ఈ మధ్య కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమలన్నిటికన్నా మన టాలీవుడ్ ఇండస్ట్రీ బాగుంది. మన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి పరభాషా దర్శకులు కూడా ఎగబడుతున్నారు. అయితే మన వాళ్ళు మాత్రం పొరుగు రాష్ట్రాల హీరోల వైపు చూస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. పొరుగింటి పుల్లకూర రుచి అని అందుకే అంటారేమో.
సరే ఇక అసలు విషయానికి వద్దాం.. శివ కార్తికేయన్ తమిళంలో రూ.40 కోట్లు మార్కెట్ ఉన్న హీరో. తెలుగులో అతను విజయ్, సూర్య, కార్తి వంటి హీరోలలా ఫేమస్ అవ్వలేదు. ఇక్కడ అతనికి తిప్పి కొడితే రూ.5 మార్కెట్ లేదు. అలాంటి హీరోకి రూ.20 కోట్లు పారితోషికం ఇస్తే.. ఆ సినిమా ఎంత బడ్జెట్ లో తీస్తారు? నిర్మాతకి ఏం మిగులుతుంది? అనేది ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ. మన స్టార్ మీడియం రేంజ్ హీరోలకి కూడా ఇక్కడ రూ.40 కోట్ల మార్కెట్ ఉంది.
నాని, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి హీరోల సినిమాలకు రూ.40 కోట్లు వసూల్ చేసే సత్తా ఉంది. కానీ వాళ్ళ పారితోషికం రూ.10 కోట్లకు మించలేదు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఎటువంటి సినిమాని అయినా ఆదరిస్తారు. అందులో అనుమానం లేదు. అలా అని దానినే ఆసరాగా తీసుకుని తెలుగు వారిని తక్కువ చేస్తే ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.