సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత నెల రోజుల్లో ఎంతో మంచి సినీ సెలబ్రిటీలు మరణించారు. ఇందులో నిర్మాతలు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, ఫ్యాషన్ డిజైనర్లు ఉండటం గమనార్హం. తాజాగా మరో టాలీవుడ్ కమెడియన్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా అలరించిన సారథి మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన మూత్రపిండాల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇందుకు గాను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కూడా..!
అయితే ఆ ట్రీట్మెంట్ ఈయనకు పనిచేయలేదు. సోమవారం తెల్లవారు జామున ఆయన మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు కావడం గమనార్హం. ఆయన మరణవార్తతో టాలీవుడ్‌లో విషాద చాయలు అల్లుకున్నాయి. ఆయన మృతికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు చింతిస్తూ టాలీవుడ్ మరో పెద్ద నటుడిని కోల్పోయింది. ఆయన మరణం తీరని లోటు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక సారథి గారు దాదాపు 372 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘సీతారామ కళ్యాణం’, ‘పరమానందయ్య శిష్యుల కథ’, ‘భక్త కన్నప్ప’, ‘జగన్మోహిని’, ‘మన ఊరి పాండవులు’, ‘డ్రైవర్ రాముడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు(చెన్నై తమిళనాడు) నుండి హైదరాబాదుకు తరలించడంలో కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) వ్యవస్థాపక సభ్యుడుగాను అలాగే ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సంస్థకి వ్యవస్థాపక కోశాధికారిగాను ఆయన సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు.