తమిళ దర్శకులు టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. కానీ ఒక్క తమిళ దర్శకుడు కూడా టాలీవుడ్ హీరోలకి హిట్లు ఇచ్చింది లేదు. అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. తమిళ హీరోలు డేట్ ఇవ్వకపోతే.. హైదరాబాద్ వచ్చేసి ఏదో ఒక హీరోని బుట్టలో పడేసి డేట్స్ తీసేసుకోవాలి అని చాలా మంది తమిళ దర్శకులు భావిస్తున్నారు. అందుకు వాళ్ళు వాడే మాటలు ఏంటో తెలుసా..
‘పాన్ ఇండియా’ లేదా ‘బైలింగ్యువల్ మూవీ’. ప్రస్తుతం ఆ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. తమిళ దర్శకుల మాయలో పడి కొంతమంది టాలీవుడ్ హీరోలు చేతులు కాల్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నుండి రామ్, నాగ చైతన్య వంటి హీరోలు కూడా అలా మోసపోయినవారే. అయితే ఓ టాలీవుడ్ హీరో మాత్రం తమిళ దర్శకుల నుండి బాగా ఎస్కేప్ అవుతున్నట్టు కనిపిస్తుంది.
అతను మరెవరో కాదు నవీన్ పోలిశెట్టి. అదేంటో ఇతను బాలీవుడ్, టాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేశాడు కానీ తమిళ దర్శకుల దృష్టిలో కూడా పడ్డాడు. ఇటీవల వచ్చిన ‘రూల్స్ రంజన్’ సినిమాకి మొదట అనుకున్న హీరో ఇతనే అని దర్శకుడు రత్నం కృష్ణ తెలిపాడు. ఆ సినిమా పెద్ద ప్లాప్ అవ్వడంతో నవీన్ చాలా లక్కీ అని అనుకున్నారు.
ఇక త్వరలో రాబోతున్న (Jigarthanda DoubleX) ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ లో ఎస్.జె.సూర్య పాత్ర కోసం కూడా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నవీన్ నే అనుకున్నాడట. కానీ అతను బిజీగా ఉండటంతో ఆ పాత్రకి ఎస్.జె.సూర్యని ఎంపిక చేసుకున్నట్టు కార్తీక్ సుబ్బరాజు తెలిపాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తెలీదు కానీ.. తమిళ డైరెక్టర్ల ఫోకస్ మాత్రం నవీన్ పోలిశెట్టి పై గట్టిగా పడినట్టు స్పష్టమవుతుంది.