2018.. టాలీవుడ్ కి .. పాఠమా..? గుణపాఠమా..?

టాలీవుడ్ కి ప్రతీ సంవత్సరం కొన్ని హిట్లతో పాటు చాలా ప్లాపులను కూడా ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 2018 వ సంవత్సరం చాలా భిన్నంగా ఉంది. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే కొన్ని హిట్లతో పాటు కొన్ని ప్లాపులను కూడా ఇచ్చినప్పటికీ.. దర్శక నిర్మాతలలకు.. అలాగే చిన్న హీరోల దగ్గర్నుండీ స్టార్ హీరోలకు చాలా పాఠాల్ని నేర్పిందనే చెప్పాలి. వందల కోట్లు పెట్టేసి తీసినంత మాత్రాన జనం థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. వారిని విసిగించకుండా… మెప్పించే సున్నిత‌మైన క‌థ‌ల‌తో వచ్చినా వారు ఆధరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హీరో ఇమేజ్ ను ప‌క్క‌న పెట్టి.. కథనంలో నిజాయితీ ఉంటే చాలు మేము ఆదరించడానికి రెడీ అంటున్నారు.

పెద్ద హీరో పెద్ద బడ్జెట్ , హీరో పక్కన జనాలు.. హీరోను పొగుడుతూ డైలాగులు.. అలాగే థీమ్ సాంగులు అనవరసరం అని చెప్పడానికి ముఖ్య నిదర్శనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం. అలా అని అవి ఉండకూడదు అని కాదు.. కథలో భాగంగా ఉండాలే కానీ ఇరికించినట్టు ఉండకూడదు అని. ఇక ‘రంగ‌స్థ‌లం’ ‘భ‌ర‌త్ అనే నేను’ లాంటి చిత్రాలు స్టార్హీరోలకు కొత్త పాఠాలుగా చెప్పుకోవచ్చు. ‘రంగ‌స్థ‌లం’ చిత్రం సాధారణ రివేంజ్ డ్రామానే. కానీ.. దాన్ని ఓ కొత్త కోణంలో చూపించ‌డం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. స్టార్ హీరో అంటే పది మందిని గాల్లో ఎగరేసి కొట్టాలి అనే పాత ధోరణి మాకు అవసరం లేదు, హీరోకు లోపాలున్నా సాధారణ మ‌నిషిగా చూపించినా మేము చూస్తాము అంటూ ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకులు నిరూపించారు. ఇక ఇదే కోవలో ‘భ‌ర‌త్ అనే నేను’ చిత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ కథ కూడా కొత్తదేమీ కాదు. గతంలో రానా నటించిన ‘లీడర్’ లాంటి కథే. అయినప్పటికీ ఆ ఫీల్ ఏమాత్రం కలుగకుండా.. చాలా క్లుప్తంగా ఈ చిత్ర కథనం ఉంటుంది. హీరోకి ఒక్క ఫైట్ కూడా లేకుండా ఇంటర్వెల్ పడుతుంది. చాలా క్లాస్ గా కనిపించినప్పటికీ మాస్‌ అంశాలు మిస్సవ్వలేదు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్లకు రోజులు చెల్లిపోయాయనుకున్న కామెంట్లకు ఈ చిత్రం బ్రేకులు వేసింది.

ఇక క‌థ‌లో వైవిధ్యం మాత్రమే ఉండాలి అనేది లేదు .. క‌థ‌నం బాగుంటే చాలు అని చెప్ప‌డానికి మరో నిదర్శనం ‘గీత గోవిందం’ చిత్రం.ఒక బ‌యోపిక్ ను ఎలా తెరకెక్కించాలి అనే దానికి ‘మ‌హాన‌టి’ ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం తరువాత బయోపిక్ ల జోరు మరింత పెరిగింది. అయితే అన్ని చిత్రాలు ‘అర్జున్ రెడ్డి’ లాగే ఉండాలి అని భావించి చేతులు కాల్చుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్ న‌టించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’అలాగే ‘కిరాక్ పార్టీ’చిత్రాలని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాల్లో హీరోలు ఓవర్ ఎక్సప్రెస్సివ్ గా ఉండటం వంటివి ప్రేక్షకులకి ‘డోస్’ ఎక్కువయ్యింది అనే భావన కలుగడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. అయితే ఒక పాత్రనో, క‌థ‌నో చూసి ఇన్స్పైర్ అవ్వాలి కానీ వాటిని అలాగే దించేయాలి అనుకోకుండా ఉండటానికి చెప్పిన ప్లాపులివి. ఇక ఊచ కొట్టుడు మాస్ డ్రామాలు చూడ‌ర‌న్న విష‌యం ‘ఇంటిలిజెంట్’ ‘ట‌చ్ చేసి చూడు’ ‘నేల టికెట్టు’ చెప్పగానే చెప్పాయి. అయితే మేం కొత్త క‌థ తీశాం.. ఇదో కొత్త ప్ర‌యోగం అని ప్రీక్షకులని మోసం చేస్తే ఏం జ‌రుగుతుందో ‘మ‌ను’ ‘వీర భోగ వ‌సంత‌రాయులు’ చిత్రాలు నిరూపించాయి. ఇవన్నీ.. 2018 కి గాను టాలీవుడ్ కు నేర్పిన పాఠాలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus