వెండితెర.. ఎర్ర తెరగా మారుతోందా? ఏమో గత కొన్ని రోజులుగా అనౌన్స్ అవుతున్న సినిమాలు, వాటి నేపథ్యాలు, గ్లింప్స్‌లు, పోస్టర్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఎందుకంటే అగ్ర హీరోలు, ఈ మధ్య అగ్ర హీరోయిన్లు వయలెన్స్ పాళ్లు ఎక్కువగా ఉన్న కథలకే ఓటేస్తున్నారు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి A సర్టిఫికెట్ వస్తుందని తెలిసినా.. సినిమా ఇచ్చే విజయం ముందు ఆ సర్టిఫికెట్లు ఎందుకు అనుకుంటున్నారో ఏమో.. రక్తపాతం పక్కాగా ఉండేలా కథలను ఎంచుకుంటున్నారు. ఈ స్టోరీ ఆఖరుకు వెళ్లేలోపు మీకే తెలిసిపోతాయి.
యాక్షన్ మోడ్‌లో ఉండే ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు అని టాలీవుడ్ బాగా నమ్ముతోంది. అందుకే అగ్ర హీరోలు కొత్త సినిమా అనగా ‘రక్తం’ అనే మాట లేకుండా పోస్టర్ రావడం లేదు. ఇటీవల వచ్చిన కొత్త సినిమాల పోస్టర్లు, గ్లింప్స్‌లతోనే స్టార్ట్ చేద్దాం. ‘రౌడీ జనార్ధన’గా విజయ్ దేవరకొండ వస్తూ కుండడు రక్తం అని డైలాగ్‌లోనే పెట్టేసి గ్లింప్స్ అంతా ఎరుపు మయం చేశాడు. ఆ వెంటనే అతని కాబోయే (ఇంకా ఎంగేజ్మెంట్ అధికారికంగా ప్రకటించలేదు అనుకోండి) భార్య రష్మిక మందన చేస్తున్న ‘మైసా’ సినిమా పరిస్థితి కూడా అంతే.

ఇక వైవిధ్య, విపరీత చిత్రాలు తీస్తారనే పేరున్న దర్శకనటుడు రవిబాబు ‘రేజర్’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా గ్లింప్స్‌లో అయితే ఏకంగా శరీరాల్ని ముక్కలు ముక్కలు నరికేయడం చూపించారు. హింసలో అదొక రకం అని చెప్పాలి. ఇక ‘ప్యారడైజ్’ సినిమాతో హింస, రక్తపాతాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్తున్నారని ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తర్వాత సినిమా చిరంజీవితో చేస్తున్నారు. ఆ కథ కూడా ఇలానే ఉండబోతోంది.
ఇవే కాదు.. ఇలాంటి కథలు చాలా ఈ మధ్య రెడీ అవుతున్నాయి. కొత్త హీరోలు కూడా ఈ కథల్ని ఓకే చేసేద్దాం.. ఆ జోన్‌లోకి వెళ్లి ప్రేక్షకుల్ని అలరించేద్దాం అని ఫిక్స్ అవుతున్నారట.
