సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్నాళ్లుగా చూసుకుంటే మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, డైరెక్టర్ అపర్ణ మల్లాది, నిర్మాత తేనెటీగా రామారావు, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో, సీనియర్ నటి విజయ భాను, అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం వంటి ఎంతో మంది సెలబ్రిటీలు మరణించారు.
కోటా శ్రీనివాసరావు, దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి వంటి స్టార్లు కూడా కన్నుమూశారు. తెలుగులోనే కాకుండా మిగతా సినీ పరిశ్రమలో కూడా నిత్యం ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా మరో రచయిత కూడా కన్నుమూసినట్టు తెలుస్తుంది. అవును టాలీవుడ్లో ఈ విషాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సుప్రసిద్ధ నవలా రచయిత అయినటువంటి లల్లాదేవి ఈరోజు కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్ళు. వయోభారంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు కన్నుమూసినట్టు తెలుస్తుంది. లల్లాదేవి పూర్తి పేరు పరుచూరి నారాయణాచార్యులు. ఈయన 150కి పైగా నవలలు రచించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సామ్రాట్ అశోక’ వంటి సినిమాలు ఈయన నవలల ఆధారంగానే రూపొందాయి.
సౌందర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శ్వేత నాగు’ సినిమా కూడా ఈయన నవల ఆధారంగానే రూపొందింది. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. ఇక లల్లాదేవి గారి అంత్యక్రియలు ప్రత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డ వారి పాలెం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది.