దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ‘తను నేను’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మోస్తరుగా ఆడింది. నటుడిగా సంతోష్ కి మంచి పేరు రావడంతో ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. అయితే సరైన హిట్టు మాత్రం రావడం లేదు. సంతోష్ శోభన్ మంచి టాలెంట్ ఉన్న నటుడు. బడా సంస్థలు, మంచి దర్శకుల నుంచి అతడికి ఆఫర్లు వస్తున్నాయి. పైగా ప్రభాస్ సపోర్ట్ కూడా ఉంది.
ఇన్ని ఉన్నా.. సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. సంతోష్ హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్లు అవుతోంది. ఇంతకాలంలో ఆయన నటించిన సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ‘ఏక్ మినీ కథ’ అనే సినిమా మాత్రం సంతోష్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఓటీటీ ఆడియన్స్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఆ విధంగా ఓటీటీలో సక్సెస్ అందుకున్నారు. థియేటర్లో విడుదలైన ‘పేపర్ బాయ్’, ‘మంచి రోజులొచ్చాయి’ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి.
తాజాగా ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ యంగ్ హీరో. సినిమాలో పాయింట్ బాగున్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్ వర్కవుట్ అవ్వకపోవడంతో సినిమా జనాలకు కనెక్ట్ అవ్వడం లేదు. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో లేదు. దీంతో సినిమాకి ప్లాప్ టాక్ వస్తోంది. హీరోగా అవకాశాలు అందుకుంటున్నా.. సంతోష్ కి అదృష్టం కలిసి రావడం లేదు.
తన తదుపరి సినిమా నందిని రెడ్డి దర్శకత్వంలో నటించారు ఈ హీరో. ఆ సినిమా టైటిల్ ఏంటంటే ‘అన్ని మంచి శకునములే’. అలానే ‘ప్రేమ్ కుమార్’ అనే మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతోనైనా.. సంతోష్ కి సక్సెస్ వస్తుందేమో చూడాలి. లేదంటే మాత్రం ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడినట్లే!