‘నిశీధిలో ఉషోదయం’ అన్నట్టు రాత్రికి రాత్రి కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. ‘నల్లధనం’ అనే రెండు తలల పాముని మట్టుపెట్టేందుకు రెండు పెద్ద నోట్లను నిషేదిస్తున్నట్టు ప్రకటిస్తూ అవినీతి రహిత భారత్ కు పిలుపునిచ్చారు. దీనిపై ఒకరిద్దరు కస్సుబుస్సులాడుతున్నా యావత్ దేశం మోడీ వెనుక నిలుస్తూ జయజయ ధ్వానాలు పలుకుతోంది. అయితే దీని ప్రభావం సినీ పరిశ్రమ మీద పడనుంది.సినిమా అంటేనే కోట్ల రూపాయల వ్యాపారం. బడా స్టార్స్ పారితోషికాలు మొదలు జూనియర్ ఆర్టిస్టులు వంటి ఇతరత్రా రోజువారీ ఖర్చులెన్నో. పారితోషికాలంటే చెక్కుల రూపంలో ఇచ్చుకోవచ్చు.
చోటా ఆర్టిస్టులకు మాత్రం నగదు రూపేణా చెల్లించాల్సిందే. బడా నిర్మాతలు కోటి రూపాయలు అటుఇటైనా ఇవ్వటానికి వెనుకాడరు కానీ ఆ కోటీ వంద నోట్లే కావాలంటే వారు మాత్రం ఎక్కడినుంచి తెచ్చేది…? సెట్స్ మీద వున్న సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, ఈ నెల 11న తెరమీదికొస్తున్న సినిమాల పరిస్థితి మరింత దారుణం. మన ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే మల్టీప్లెక్స్ లకు అలవాటుపడుతున్నా, వందరూపాయల టికెట్లు తెగే థియేటర్లే ఎక్కువ. గృహ అవసరాలకు, రోజువారీ ఖర్చులకి కేటాయించడమే కష్టమవుతున్న ఈ తరుణంలో ఆ వంద ఏ హీరో సినిమాకిస్తారో..? అందరి మాట ఏమో గానీ ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్నా నాగచైతన్య ‘సాహసం..’ సినిమాకి మోడీ నిర్ణయంతో మరో పెద్ద దెబ్బ తగిలింది. దీని నుండి ఎలాంటి సాహసం చేసి బయటపడతారో మరి..?