ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హవా ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలంతా కూడా అభిమానులతో ముచ్చటించడానికి, తమ సినిమాల ప్రమోషన్స్ కి సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన తారల పేర్లు, సినిమాలు ట్రెండ్ అయ్యేలా చూస్తుంటారు. ఈ ఏడాదిలో ఏ హీరోలు, హీరోయిన్లు, సినిమాల గురించి ట్విట్టర్ లో ఎక్కువగా చర్చ జరిగిందో ఆ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. ”మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది..! 2020లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన దక్షిణ భారత సూపర్‌స్టార్స్ వీరే” అంటూ కొన్ని జాబితాలను విడుదల చేసింది.
హీరోల లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. పవన్ కళ్యాణ్ కి రెండో స్థానం రాగా.. తమిళ సూపర్ స్టార్ విజయ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో విపరీతమైన పాపులారిటీ ఉన్న పవన్, విజయ్ లాంటి హీరోలను దాటేసి మహేష్ ముందు స్థానంలో ఉండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ నాలుగో స్థానం, సూర్య ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు. అల్లు అర్జున్ ఆరవ స్థానంలో, రామ్ చరణ్ ఏడవ స్థానంలో నిలిచారు. ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి తదుపరి స్థానాలను దక్కించుకున్నారు.
హీరోల మాదిరి హీరోయిన్ల లిస్ట్ కూడా బయటకొచ్చింది. మహానటి కీర్తి సురేష్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. లాక్ డౌన్ లో కీర్తి పేరు బాగా మార్మ్రోగింది. ఓటీటీ రిలీజ్ లతో నిత్యం వార్తల్లో నిలిచేది. అలానే మహేష్ ‘సర్కారు వారి పాట’లో ఆమెనే హీరోయిన్. దీంతో ఆమె పేరు బాగా ట్రెండ్ అయింది. కీర్తి తర్వాత స్థానాలను కాజల్, సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే దక్కించుకున్నారు. ఆరో స్థానంలో తాప్సి నిలవగా.. తమన్నా ఏడవ స్థానాన్ని దక్కించుకుంది. కోలీవుడ్ భామ శృతిహాసన్ తొమ్మిది, త్రిష పది స్థానాలతో సరిపెట్టుకున్నారు.