Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్ ఇదే
- August 26, 2026 / 03:00 PM ISTByFilmy Focus Desk
జీవితం గురించి సినిమాల్లో బాగా చెప్పే దర్శకులు చాలా తక్కువ మందే అనొచ్చు. అందులో నేటి తరంలో ప్రథములు త్రివిక్రమ్ శ్రీనివాస్. వినడానికి వేదాంతంలా ఉన్నా, ఏంటీ క్లాస్ పీకడం అని అనిపించినా ఆ మాటల్లో ఎంతో అర్థం ఉంటుంది. అవి పెద్ద జీవిత పాఠాలే అవుతాయి. అలాంటి వ్యక్తి నిజం జీవితంలో తన మాట చెబితే ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది చెప్పండి. రీసెంట్‌గా ఆయన పరాజయం గురించి పర్‌ఫెక్ట్ ఆలోచనలు చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ వైరల్ అవుతున్నాయి.
Trivikram
ఈ క్రమంలో ఆయన ‘అజ్ఞాతవాసి’ సినిమా గురించి.. ఆ సినిమా సమయంలో ఆయన, పవన్ కల్యాణ్ చేసిన పని గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఫలితం గురించి ఇప్పటివరకు పెద్దగా మాట్లాడని త్రివిక్రమ్.. ఇప్పడు ఓ టీవీ కార్యక్రమంలో స్పందించారు. ఆ సినిమా పరాజయం వెనుక తన జీవితంలోని కథను చెప్పుకొచ్చారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టారట త్రివిక్రమ్. ఆ సినిమా ఫెయిలవడంతో మొత్తం రెమ్యూనరేషన్‌ను వెనక్కి ఇచ్చేశారట. పవన్ కల్యాణ్ కూడా రెమ్యూరేషన్‌లో కొంత వెనక్కి ఇచ్చేశారట.

ఈ క్రమంలో త్రివిక్రమ్ కొత్తింటి ఇంటి పని ఆగిపోయిందట. అయితే తనకు కష్టం వచ్చింది కదా అని.. దాన్ని భార్యాపిల్లల దగ్గర దాచాలనుకోలేదట. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లే అయినా వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం చెప్పారట. ఇకముందూ మనం ఇదే ఇంట్లోనే ఉంటామని చెప్పారట. అవసరమైతే ఇల్లు కూడా అమ్మేయాల్సి రావొచ్చు అని కూడా చెప్పారట. దాన్ని వాళ్లు కూడా తేలిగ్గానే తీసుకున్నారట. దీంతో తన మీద భారం తగ్గిపోయిందన్నారు త్రివిక్రమ్.
ఈ మాటల వెనుక కారణం కూడా చెప్పారాయన. తన ఓటమి విషయం తాను దాచిపెట్టాలన్నా దాగేది కాదని, పిల్లలకు ఈ విషయం అర్థమైపోతుందని చెప్పారు. అందుకే లోలోన బాధపడే కన్నా.. విషయం తెలిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని అలా చేశానని చెప్పారు. అర్థమైందిగా ఓటమిని ఎలా తీసుకోవాలో..















