కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు ఎందుకో సరిగా ఆడవు. తెలుగులో ఉదాహరణకు “అంజి (Anji), ఖలేజా (Khaleja), ఆరెంజ్”(Orange) వంటి సినిమాలున్నాయి. ఈ సినిమాలు విడుదలైనప్పుడు కనీస స్థాయి కలెక్షన్స్ రాబట్టుకోలేక డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. కానీ.. ఇప్పుడు అవే సినిమాలు రీరిలీజ్ అయినప్పుడు భీభత్సమైన డబ్బులు కలెక్ట్ చేస్తూ సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఓ బాలీవుడ్ సినిమా కూడా చేరింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. సినిమా రిలీజైనప్పటికంటే డబుల్ కలెక్షన్స్ వసూలు చేసింది చిత్రం.
Tumbbad Re-release
అదే హిందీ కల్ట్ సినిమాల్లో ఒకటైన “తుంబాడ్” (Tumbbad) . ఈ సినిమా విడుదలైనప్పుడు కేవలం 3.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. చూసినవాళ్లందరూ అద్భుతం అని పొగిడినా థియేటర్లకు జనం మాత్రం రాలేదు. కానీ.. ఓటీటీ విడుదల తర్వాత మాత్రం సినిమా మేకింగ్ స్టైల్, ఆర్ట్ వర్క్ అండ్ ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ కి కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.
అటువంటి కల్ట్ స్టేటస్ ఉన్న “తుంబాడ్” సినిమాను గతవారం రీరిలీజ్ చేసారు. ఇండియా మొత్తం రీరిలీజ్ అయిన ఈ చిత్రం అన్నీ మల్టీప్లెక్స్ సిటీల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. దాంతో మొదటి వారాంతంలోనే ఈ చిత్రం దాదాపుగా 7 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. సినిమాను ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన సోహం షా ఈ రీరిలీజ్ కి వచ్చిన స్పందన చూసిన ఆనందంలో వెంటనే “తుంబాడ్ 2” కూడా ఎనౌన్స్ చేశాడు.
ఈ విధంగా కంటెంట్ ఉన్న సినిమాలు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయడం అనేది మారుతున్న ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా తార్కాణంగా నిలుస్తుంది. మరి మన ఫిలిం మేకర్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ భవిష్యత్ చిత్రాల రూపకల్పన విషయంలో ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి!