‘మహానటి’ సినిమా తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ తన కొత్త సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. మధ్యలో ఓటీటీ కోసం ‘పిట్టకథలు’ అనే వెబ్ ఫిల్మ్ లో ఓ కథను డైరెక్ట్ చేశారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ కె’ అనే సినిమాను మొదలుపెట్టారు నాగ్ అశ్విన్. టైమ్ మిషన్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోన్ ను తీసుకున్నారు.
అలానే మరో ముఖ్య పాత్ర కోసం అమితాబ్ ను రంగంలోకి దించారు. అయితే కథ ప్రకారం మరికొంతమంది స్టార్లను తీసుకుంటున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఇతర భాషల నుండి నటీనటులను దిగుమతి చేసుకుంటున్నారు. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను కీలకపాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. హీరోగా ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ.. ప్రభాస్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
అలానే మరో పాత్ర కోసం సమంతను తీసుకోవాలనుకుంటున్నారట. నాగ్ అశ్విన్ తో సమంతకు మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి ‘మహానటి’ సినిమాకి వర్క్ చేశారు. కాబట్టి ఆమె ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి స్టార్ క్యాస్ట్ తోనే నాగ్ అశ్విన్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.