తమిళం, మలయాళం, కన్నడలో వచ్చిన కొన్ని చిన్న సినిమాలు చాలా బాగుంటాయి. వాటి గురించి మనకు తెలియడం ఒకప్పుడు కాస్త ఆలస్యమయ్యేది. అయితే ఇప్పుడు సౌత్ సినిమాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం వస్తూనే ఉంది. దీంతో ఆ సినిమాలు తెలుగులో కూడా త్వరగా వస్తే బాగుండు అని సినీ గోయర్స్ అనుకుంటున్నారు. థియేటర్లలో రాకపోయినా టీవీలో, ఓటీటీలో వచ్చినా ఓకే అనుకుంటున్నారు. అలా మీరు కూడా అనుకుంటుంటే… ఓ రెండు హిట్ సినిమాలు వస్తున్నాయి మరి.
ఓటీటీ పెట్టి కొన్నేళ్లు అయినా ఇటీవల ఈటీవీ విన్ జోరు పెంచింది. కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమ్ చేస్తోంది. అలా అనూహ్యంగా వచ్చి భారీ విజయం అందుకున్న సిరీస్ ‘#90s: మిడిల్ క్లాస్ బయోపిక్’. ఈ జోరులో ఈటీవీ విన్ మరో రెండు ఆసక్తికర చిత్రాలను తీసుకురాబోతోంది. చిన్న చిన్న కథలతో ప్రేక్షకుల రంజింపజేసే సినిమాలు ఇవ్వడం మలయాళం ఇండస్ట్రీ ప్రత్యేకత. అలా గతేడాది అక్టోబరులో ‘లిటిల్ మిస్ రాథర్’ అనే సినిమా వచ్చింది.
ఇక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ చేయడం తమిళ సినీ జనాలకు అలవాటు. అలా గత సెప్టెంబరులో వచ్చిన చిత్రం ‘పరుం పోరల్’. ఇప్పుడు ఈ రెండు సినిమాలే తెలుగులో రాబోతున్నాయి. గౌరీ జి కిషన్, షేర్షా షరీఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘లిటిల్ మిస్ రాథర్’ను తెలుగులో ‘లిటిల్ మిస్ నైనా’గా తీసుకొస్తున్నారు. విష్ణు దేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈటీవీ విన్‌లో జనవరి 25 నుండి స్ట్రీమింగ్‌కి వస్తోంది.
మరోవైపు శరత్‌కుమార్, అమితాష్ ప్రధాన్ కీలక పాత్రల్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ (Paramporul) ‘పరం పోరుల్’. సి.అరవింద్‌రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాను అదే పేరుతో ఫిబ్రవరి 1 నుండి విన్‌లో తీసుకొస్తున్నారు.పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సమాజంలోని సున్నితమైన అంశాల నేపథ్యంలో సాగే చిత్రం ‘లిటిల్ మిస్ నైనా’. ప్రస్తుతం సొసైటీలో చర్చనీయాంశంగా ఉన్న అనేక అంశాలు ఇందులో చూడొచ్చు.