సామాజిక అంశాలను కథలుగా మలిచి సినిమాలను తెరకెక్కిస్తుంటారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించారు. 1990లో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.
ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. హర్యానా ప్రభుత్వపు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ సినిమా ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ది కశ్మీర్ ఫైనల్’ అనే సినిమాకి హర్యానా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుందంటూ ట్వీట్ చేసింది ప్రభుత్వం. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు అగ్నిహోత్రి.. హర్యానా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ మహిళ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పాదాలను పట్టుకొని.. సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ గట్టిగా ఏడ్చేసింది. దీంతో వివేక్ ఆమెని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు.
అదే సమయంలో నటుడు దర్శన్ కుమార్ ఆమెని దగ్గర తీసుకొని ఓదారుస్తూ.. అతడు కూడా ఎమోషనల్ అయ్యాడు. ఆమె ఏడవడం చూసిన అక్కడున్నవారంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు.