కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ‘తమిళగ వెట్రి కళగం’ అనే కొత్త పార్టీని స్థాపించి, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పార్టీ మొదటి మహానాడు సభను విక్రవాండి గ్రామంలో నిర్వహించారు. ఈ సభకు విజయ్ అభిమానులు, మద్దతుదారులు లక్షలాది మంది తరలివచ్చారు. విజయ్ పవర్‌ఫుల్ పొలిటికల్ స్పీచ్‌తో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు, అతడి పట్ల అభిమానులు చూపించిన మద్దతు చర్చనీయాంశమైంది.
Vijay
అయితే, సభ ముగిసిన తర్వాత వేదిక వద్ద తీవ్రంగా గందరగోళం చోటుచేసుకుంది. అభిమానులు కుర్చీలు విరగ్గొట్టడం, బారికేడ్లను పగులగొట్టడం వంటి చేష్టలతో నిర్వాహకులు నష్టపోయారు. మిగిలిన వ్యర్థాలు, గందరగోళం పరిస్థితి వీడియోల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పబ్లిక్ ఈవెంట్లలో కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నా, ఇక్కడ జరిగిన డ్యామేజ్ మాత్రం అసాధారణం. నిర్వాహకులకు భారీ నష్టం వాటిల్లింది, దీనిపై నిర్వాహకులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
తమ హీరో రాజకీయాల్లో సక్సెస్ కావాలని కోరుకునే అభిమానులు మరింత బాధ్యతగా వ్యవహరించడం ముఖ్యమని సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాలు అంటున్నాయి. విజయ్ తన మొదటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటూ ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్న ఈ సమయంలో అభిమానులు పట్టు కోల్పోకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా ఈవెంట్లలో చేసే ఆతృతను ఇక్కడ కూడా చూపించడం వల్ల ప్రజల్లో ఆ పార్టీ గురించి తప్పు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.
సభ సందర్భంగా, ప్రయాణంలో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర వార్తలు వెలువడ్డాయి. ఒకరు బైక్ ప్రమాదంలో మరణిస్తే, మరొకరు రైలు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎండ తీవ్రత కారణంగా సభలో పలువురు డీహైడ్రేషన్‌కు గురవ్వగా, వీరి కోసం 11 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
తమిళ జాతీయత, సామాజిక న్యాయం అంశాలపై విజయ్ తన తొలి పొలిటికల్ స్పీచ్ లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. తమిళ గడ్డకు ద్రవిడ సిద్ధాంతం ఒక కన్ను, జాతీయత మరో కన్ను అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విజయం సాధించేందుకు ఆ ప్రయాణంలో నిలబడి ముందుకు వెళ్లాలని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.