నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు ఉన్నాయి. సెమి హిట్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ‘గొప్పింటి అల్లుడు’ ఒకటని చెప్పాలి. క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. బాలయ్య తన ఇమేజ్ ను పక్కన పెట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సినిమా అని కూడా చెప్పవచ్చు. ‘గొప్పింటి అల్లుడు’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) నందమూరి బాలకృష్ణ 77వ సినిమాగా ‘గొప్పింటి అల్లుడు’ ప్రారంభమైంది. దీనికి ముందు బాలకృష్ణ చేసిన ‘సుల్తాన్’ ‘కృష్ణ బాబు’ ‘వంశోద్ధారకుడు’ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఈ క్రమంలో కచ్చితంగా హిట్టు కొట్టాలని భావించి ‘గొప్పింటి అల్లుడు’ చేశాడు బాలయ్య.
2) ఈవీవీ సత్యనారాయణ – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇది. అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారందరికీ సూపర్ హిట్లు ఇచ్చారు ఈవీవీ. బాలకృష్ణతో సినిమా చేయాలని చాలా కాలం పాటు ఎదురుచూశారు ఆయన. మొత్తానికి ఆయన కల ‘గొప్పింటి అల్లుడు’ తో తీర్చుకున్నారు.
3) ‘రామకృష్ణ సినీ స్టూడియోస్’ బ్యానర్ పై బాలకృష్ణ సోదరుడు, సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అయిన నందమూరి రామకృష్ణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
4) బాలీవుడ్లో 1997 లో గోవిందా, కరిష్మా కపూర్ జంటగా నటించిన ‘హీరో నెంబర్ 1’ సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.
5) మురళి మనోహర్ (నందమూరి బాలకృష్ణ) పెద్ద బిజినెస్ మెన్ అయినటువంటి ఎస్వీఆర్ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కొడుకు. కొన్ని కారణాల వల్ల విదేశాలకు వెళ్లిన మనోహర్.. అచ్యుత రామయ్య ( కైకాల సత్యనారాయణ) మనవరాలు సౌమ్య (సిమ్రాన్) తో ప్రేమలో పడతాడు. వాళ్ళు తిరిగి ఇండియాకు వచ్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అయితే అనుకోకుండా ఎస్వీఆర్ వల్ల అచ్యుత రామయ్య వీల్ చైర్ పాలవుతాడు. ఆ యాక్సిడెంట్ చేసింది సౌమ్య ప్రియుడు మనోహర్ తండ్రి ఎస్వీఆర్ అని తెలిసి ద్వేషం పెంచుకుంటాడు. వారి పెళ్ళికి కూడా ఒప్పుకోడు. ఈ గొడవలు సాల్వ్ చేయడానికి, తన ప్రేమను గెలిపించుకోవడానికి మురళీ మనోహర్.. అచ్యుత రామయ్య ఇంటికి వంటోడుగా వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
6) ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు. సంఘవి పాత్రలో ఎక్కువ నెగిటివ్ షేడ్స్ పెట్టడం జరిగింది. అలాగే కామెడీ డోస్ కూడా పెంచారు ఈవీవీ. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఆయన కామెడీని ఎక్కువ పెట్టారు అని చెప్పాలి.
7) ‘గొప్పింటి అల్లుడు’ కి మొదట మణిశర్మని సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ మణిశర్మ ఫుల్ బిజీగా ఉండటం వల్ల కోటిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ‘ప్రేమిస్తే ఎంతో గ్రేటు’ అనే పాట ఇప్పటి యూత్ కి కూడా నచ్చేలా ఉంటుంది.
8) అప్పటివరకు బాలకృష్ణ ఎక్కువగా మాస్ రోల్స్ చేశారు. ‘గొప్పింటి అల్లుడు’ లో లవర్ బాయ్ గా కనిపించి కామెడీ కూడా పండించారు.
9) 2000 సంవత్సరంలో జూలై 21న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోతో ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాలయ్య ఇమేజ్ కి ఈ సినిమా సెట్ అవ్వలేదు అని కొంతమంది విమర్శించారు. కానీ తర్వాత యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
10) మంచి కాంబినేషన్, బాలయ్య చేసిన కొత్త ఎటెంప్ట్ కి.. ఫ్యాన్స్ కనెక్ట్ కాలేదు. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న ‘గొప్పింటి అల్లుడు’ జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే దాదాపు 22 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఈ సినిమా.
నేటితో ‘గొప్పింటి అల్లుడు’ రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తి కావస్తోంది. పలు యూట్యూబ్ ఛానల్స్ లో అందుబాటులో ఉంది. ఖాళీ దొరికితే ఒకసారి ఈ సినిమాని ట్రై చేయండి. కొత్త బాలయ్యని చూసినట్టు ఉంటుంది.. టైం పాస్ కూడా చేయిస్తుంది.