Manasantha Nuvve: 21 ఏళ్ల ‘మనసంతా నువ్వే’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

  • October 20, 2022 / 01:40 AM IST

ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ‘మనసంతా నువ్వే’ చిత్రం రిలీజ్ అయ్యి ఈరోజు అంటే అక్టోబర్ 19తో 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2001 వ సంవత్సరం అక్టోబర్ 19న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.వి.ఎన్.ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ మూవీకి యం.యస్.రాజు నిర్మాత. మొదటి షోకే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ప్రేమ కథ, ఆధ్యంతం అలరించే సునీల్ కామెడీ, వినసొంపుగా ఉండే సంగీతం అన్నీ కలగలిపి ఈ మూవీని పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. అయితే ఈ చిత్రం గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) 21 ఏళ్ల క్రితం అంటే 2001లో సంక్రాంతి కానుకగా వెంకటేష్ నటించిన ‘దేవి పుత్రుడు’ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ రోజుల్లోనే ఈ మూవీకి రూ.14 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాత యం.యస్.రాజు. కానీ ఈ సినిమా ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ‘శత్రువు’ సక్సెస్ ఇచ్చిన కిక్, ‘దేవి’ వల్ల వచ్చిన లైఫ్… ఇవన్నీ ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తో స్మాష్ అయిపోయాయి.ఆ సినిమా ప్లాప్ నుండి ఎలాగైనా బయటకు రావాలని యం.యస్.రాజు అనుకున్నారు.ఒక రోజు `అన్మోల్ ఘ‌డీ` అనే చిత్రం చూసి దాని స్పూర్తితో ఓ కథ అల్లుకున్నారు.

2) హీరో హీరోయిన్లు విడిపోయి కలుసుకోవడానికి పడే తపన అన్నది లైన్. ఈ లైన్ ను యం.యస్.రాజు పరుచూరి బ్రదర్స్ కి, కెమెరామెన్ ఎన్ గోపాల్ రెడ్డి కి వినిపించారు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ తో కథ అల్లేసుకున్నారు.

3)’సుమంత్ ఆర్ట్స్’ సంస్థ పై కోడి రామకృష్ణ గారితోనే ఈ సినిమా చేయాలని మొదట అనుకున్నారు యం.యస్.రాజు. కానీ ఆ టైం లో ఆయనకు చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. ఆ టైంలో ఎస్ గోపాల్ రెడ్డి గారు వి.ఎన్.ఆదిత్య గురించి చెప్పారు. మొదట ఆయనకు కథ వినిపించగానే రైల్వే స్టేషన్ లో హీరో(ఉదయ్ కిరణ్) కి అతని స్నేహితుడు(సునీల్) మధ్య ఓ సన్నివేశం చెప్పారు. అంతే వి.ఎన్.ఆదిత్య ని ఫిక్స్ చేసేశారు.

4) హీరో పాత్ర కోసం ముందుగా మహేష్ బాబుని అనుకున్నారు. కానీ ఆ టైంలో మహేష్ కి ఉన్న ఇమేజ్ వేరు. దీంతో ‘నువ్వు నేను’ దర్శకుడు తేజ కి ఫోన్ చేశారు యం.యస్.రాజు గారు. అప్పుడు ‘నువ్వు నేను’ సెట్స్ లో ఉంది. అప్పటికి ఆ సినిమా నుండి ఒక సాంగ్ ను యం.యస్.రాజు కి చూపించారు. కుర్రాడు(ఉదయ్ కిరణ్) బాగున్నాడు అనిపించింది. అరగంటలో అతను రాజు గారి ఆఫీస్ దగ్గర ఉన్నాడట ఉదయ్ కిరణ్. అలా ఉదయ్ కిరణ్ ఫైనల్ అయ్యాడు.

5) భూమిక ని హీరోయిన్ గా అనుకుంటే ఆమె ‘ఒక్కడు’ కథని చూజ్ చేసుకుందట. దీంతో మళ్ళీ తేజని అడిగితే రీమాసేన్ గురించి చెప్పాడట. కాబట్టి ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

6) సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ని అనుకున్నారు యం.రాజు. తన ‘దేవి’ సినిమాకి అతను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అందుకే అతన్ని తీసుకోవాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఈ ప్రాజెక్టు చేయలేకపోయాడు. దీంతో ఆర్.పి పట్నాయక్ ను ఫైనల్ చేశారు. ఒక్కరోజులోనే ఆయన అన్ని ట్యూన్స్ చేసి ఇచ్చేశాడట.

7) మే 10 యం.యస్.రాజు గారి పుట్టినరోజు కావడంతో ఆ రోజునే ‘మనసంతా నువ్వే’ కి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ‘చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా’ పాటను వానలో తీద్దాం అనుకుంటుంటే నిజంగానే ఆ టైంకి వచ్చిందట.

8) రూ.1 కోటి 30 లక్షల బడ్జెట్ తో ‘మనసంతా నువ్వే’ చిత్రం షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఉదయ్ కిరణ్ హీరో కావడంతో చాలా మంచి బిజినెస్ ఆఫర్స్ వచ్చాయట ‘మనసంతా నువ్వే’ చిత్రానికి..!

9) కానీ ‘దేవి పుత్రుడు’ తో నష్టపోయిన బయ్యర్స్ కోసం కేవలం అడ్వాన్స్ లు తీసుకుని ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాత యం.యస్.రాజు. సినిమా ప్లాపైనా ఆయన రూ.6 కోట్ల నష్టాన్ని తీర్చేయడానికి రెడీగా ఉన్నారట.

10) కానీ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం, ఫుల్ రన్లో ఈ మూవీ రూ.18 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడంతో రాజు గారికి భారీ లాభాలు దక్కాయి. అదే ఏడాది ఈయనకు పెద్ద రిలీఫ్ దొరికింది. ఆడియో రైట్స్, రీమేక్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ రూపంలో కూడా కలుపుకుని ఆయనకు రూ.16 కోట్ల వరకు లాభాలు మిగిలాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus