సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 21 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!

గోదావరి మధ్యలో ఉంది లాంచీ. టాపు మీద కూర్చున్న కృష్ణవంశీ చుట్టూ గోదావరిని పరికించి చూశారు. ఆహా ఏమి ప్రశాంతత! సినిమా సినిమాకీ గ్యాప్‌లో ఇలా గోదావరి జిల్లాల కొచ్చి ఫ్రెండ్స్‌తో గడపడం తనకి అలవాటు. క్లాప్, స్విచ్ ఆన్ ఇలాంటి మాటలు లేకుండా ఫ్రెండ్స్‌తో మనసు విప్పి మాట్లాడుతుంటే హాయిగా ఉంది. సడెన్‌గా సీరియస్ డిస్కషన్. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఇలా ఆ ఫ్యామిలీ అంతా ఆకస్మిక దుర్మరణాలే! ఎందుకంటావ్? ఆసక్తిగా అడిగారు కృష్ణవంశీ. ఆయుర్వేద డాక్టర్ గున్నేశ్వ ర్రావు ఒకటే అన్నారు శాపం. కృష్ణవంశీ భ్రుకుటి ముడిపడింది. శాపమా? ఫ్రెండ్ ఇంకో ఇన్సిడెంట్ చెప్పాడు. ఆంధ్రాలో ఓ ఫేమస్ పర్సన్. పాలేరుని కొట్టడమో, చంపడమో చేశాడు. పాలేరు పెళ్లాం శాపనార్థాలు పెట్టింది. కట్ చేస్తే అతగాడి పెద్ద కొడుకు పొలానికెళ్లి ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. ఆ కర్మకాండలు చేసొస్తూ రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రెయిన్ గుద్దేసి రెండో కొడుకు పోయాడు.

ఇది వినగానే కృష్ణ వంశీ షేకైపోయాడు. ఆ రాత్రి నిద్ర లేదు. ఆ రాత్రే కాదు చాలా రాత్రిళ్లు నిద్ర రాలేదు. మహేష్ బాబు కోసం ప్రశాంతంగా కథ ఆలోచిస్తున్న టైమ్‌లో ఏంటీ కలవరం? నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు గారు నుంచి ఫోన్. సార్ మీ పని మీదే ఉన్నా అని కాసేపు ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు కృష్ణవంశీ. సూపర్‌స్టార్ కృష్ణ గారికి కరడు గట్టిన వీరాభిమాని రామలింగేశ్వరరావు గారు. కృష్ణతోనే కిరాయి కోటిగాడు, కంచు కాగడా, దొంగోడొచ్చాడు లాంటి సినిమాలు తీశారు ఆయన.

ఇప్పుడు మహేష్ బాబుతో కృష్ణవంశీ డెరైక్షన్‌లో సినిమా చేయాలనేది టార్గెట్. కృష్ణవంశీకేమో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. మంచి కథ దొరికినప్పుడు చేస్తానని తప్పించుకోడానికి ప్రయత్నించాడు. ఆయన వదల్లేదు. ప్రస్తుతం కృష్ణవంశీ ఆ పనిలోనే ఉన్నాడు. ఏ పని చేస్తున్నా మహేష్ గురించే ఆలోచన. మహేష్ అందగాడు. బృందావనంలో కృష్ణుడిలాగా ముగ్ధమనో హరంగా ఉంటాడు. తనతో ఎలాంటి సినిమా తీయాలి? ఎస్ దొరికేసింది.

బృందావనంలో కృష్ణుడు. ఈ కాన్సెప్ట్‌ని అప్లై చేసి సినిమా చేస్తే అదిరి పోతుంది. కానీ ఇంకా చాలా దినుసులు కావాలి. ఈ బృందావనానికి ఆ శాపాన్ని జత చేస్తే?! క్లారిటీ వచ్చేసింది. పద్మాలయా స్టూడియోలో కృష్ణ గారి చాంబర్. కృష్ణవంశీ కథ చెబుతుంటే కృష్ణ గారు, మహేష్, రామలింగేశ్వరరావు గారు వింటున్నారు. ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. కృష్ణ గారు ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు. వంశీ! నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ బాగున్నట్టే ఉంది.

నువ్వూ, మహేష్ డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి వెళ్లిపోయారు. ఇప్పుడు బాల్ మహేష్ కోర్టులో ఉంది. అతనికేమో కృష్ణవంశీతో మంచి లవ్‌స్టోరీ చేద్దామని ఉంది. ఇతనేమో బృందావనం, శాపం అంటున్నాడు. బాల్ షిఫ్ట్స్ టు రామలింగేశ్వరరావు కోర్ట్. ఆయన కృష్ణవంశీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కృష్ణవంశీ మొండివాడు. వినడే! రామలింగేశ్వర్రావు గారూ మొండివాడే! వదలడే! కృష్ణవంశీ ఇంకో కథ చేశాడు. ముగ్గురమ్మాయిలతో రొమాంటిక్ స్టోరీ. భలే ఉందే అన్నారు కృష్ణ గారు. మహేష్ కూడా. అప్పుడు పేల్చాడు కృష్ణవంశీ బాంబు. ఈ కథతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ కావచ్చు. కానీ ఆ కథతో సినిమా అయితే మాత్రం ఓ ఇరవై, ముప్ఫై ఏళ్లు చరిత్రలో నిలిచిపోతుంది. ఆలోచించుకోండి. కాదూ, కూడదంటే ఈ కథ మీకిచ్చేస్తాను. వేరే డెరైక్టర్‌తో చేయించుకోండి. మళ్లీ కథ మొదటికొచ్చింది. రామ లింగేశ్వరరావు గారు తలపట్టుకున్నాడు.

ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? మహేష్ కృష్ణవంశీని నమ్మాడు. కృష్ణవంశీ కథను నమ్మాడు. రామలింగేశ్వరరావు గారు ఈ కాంబినేషన్‌ను నమ్మాడు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. స్క్రిప్ట్ ఫైనలైజేషన్ కోసం భారతం, భాగవతం చదివి కృష్ణ తత్త్వాన్ని ఒంటబట్టించు కోవాల్సి వచ్చింది. కృష్ణుడు, యశోద, పాండవులు, దుర్యోధనుడు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నింటినీ సోషలైజ్ చేసేశాడు. రుక్మిణి, సత్యభామ పాత్రలను కలగలిపి హీరోయిన్ పాత్రను డిజైన్ చేశాడు.

కథ ఫైనల్ అయ్యింది కానీ, క్లైమాక్స్‌ను ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పటికో ముడివీడింది. కానీ చాలా డౌట్లు మిగిలి పోయాయి. అమ్మవారి శాపాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నామా అనేది పెద్ద డౌట్. గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిశాడు. ఆయన డౌట్లన్నీ తీర్చేశారు. ఇప్పుడు కృష్ణవంశీకి ఫుల్ క్లారిటీ. టైటిల్ కృష్ణా ముకుందా మురారి అనుకున్నాడు. మురారి అని సింపుల్‌గా పెడితే బెటర్ కదా అన్నాడు రామలింగేశ్వరరావు గారు.

సినిమా నిండా ఆర్టిస్టులే ఆర్టిస్టులు. కైకాల సత్యనారాయణ, లక్ష్మి, గొల్లపూడి ఇలా చాలా మంది కావాల్సి వచ్చారు. బామ్మ పాత్రకు బెంగళూరు వెళ్లి మరీ షావుకారు జానకి గారికి కథ చెప్పారు. 40 రోజుల డేట్లు అంటే కష్టం అందావిడ. ఫైనల్‌గా మలయాళ నటి సుకుమారి సెలెక్టెడ్. ఇక మహేష్ పక్కన హీరోయిన్ అంటే క్యూట్‌గా ఉండాలి. హేమమాలిని కూతురు ఇషా డియోల్ అయితే బావుంటుందనిపించింది. హేమమాలిని దగ్గరికెళ్తే రెమ్యునరేషన్ ఎంతిస్తారు అని మొహం మీదే అడిగేసిందావిడ. దాంతో డ్రాప్.

సోనాలీబెంద్రే రిఫరెన్స్ వచ్చింది. హైదరాబాద్‌లో ఫ్రెండ్ పెళ్లికి వచ్చి, కథ విని కాల్షీట్స్ ఇచ్చేసిందామె. ఫుల్ ట్రెడిషనల్ సినిమా ఇది. విలేజ్ అట్మాస్ఫియర్, పండగ హంగుల్లాంటివి కావాలి. ఆర్ట్ డెరైక్టర్ గట్టివాడే ఉండాలి. శ్రీనివాస రాజు సమర్థుడు. కృష్ణవంశీ కథ చెప్పగానే స్కెచ్‌లు వేసేశాడు. హీరో ఇల్లు, హీరోయిన్ ఇల్లు చాలా పెద్దగా ఉండాలి. కేరళ వెళ్లి చూసొచ్చారు. కానీ ఇంతమంది ఆర్టిస్టులతో అంత దూరం వెళ్తే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. రామానాయుడు సినీ విలేజ్‌లో సెట్స్ వేసేస్తే బెటర్.

ఇంకా కావాలనుకుంటే రామచంద్రా పురం రాజావారి కోటలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు. సినిమాలో ఇంపార్టెంట్ టెంపుల్ సీన్స్. మూడు తరాల నేపథ్యానికి సంబంధించి సీన్లు అక్కడే తీయాలి. అంటే పురాతనమైనది కావాలి. కర్ణాటకలోని బాదామిలో దొరికింది. ఒకేసారి అక్కడికి వెళ్లి సీన్లు తీయడం కష్టం. నాలుగైదుసార్లు వెళ్లాల్సిందే. ఇదీ తడిసి మోపెడయ్యే వ్యవహారమే. అందుకే శంషాబాద్ టెంపుల్‌కి ఫిక్సయ్యారు.

ఓ ఏనుగు కావాలి. ఇక్కడ దొరకదు. కేరళ నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇలాంటి సినిమాకి సీనియర్ కెమెరామ్యాన్ కావాలి. కానీ కృష్ణవంశీ మెరుపులో ఓ పాట చూసి సి.రామ్ ప్రసాద్‌కి ఆఫరిచ్చేశాడు. మ్యూజిక్ డెరైక్టర్‌గా మణిశర్మ బెస్టని ఫీలయ్యారు. క్లైమాక్స్‌లో కీలకపాత్ర కోసం సీనియర్ నటుడు ఉంటే బాగుంటుందనుకున్నారు. దానవీరశూర కర్ణలో శకునిగా చేసిన ధూళిపాళ రిటైరైపోయి, గుంటూరుకు సమీపంలో స్థిరపడ్డారు. కృష్ణవంశీ వెళ్లి ఒప్పించారు.

ఐదు నెలల షూటింగ్. రోజుకి 12 గంటలు తక్కువ పనిచేయలేదు. కృష్ణ వంశీకి స్క్రిప్ట్ అంతా మైండ్‌లోనే ఉంది కాబట్టి నో కన్‌ఫ్యూజన్. ఆర్టిస్టులు కూడా బాగా ఇన్‌వాల్వ్ అయిపోయి పనిచేస్తున్నారు. మహేష్ బాబు అయితే క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. 104 డిగ్రీల జ్వరంలో కూడా గోదావరి ఒడ్డున డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలి పాట, వాటర్ ఫైట్ చేశాడు. చెప్పమ్మా చెప్పమ్మా పాటలో ముగ్గు సోనాలీ బేంద్రేలా మారే షాట్‌కి టెర్మి నేటర్లోని జైలు సీను ఇన్‌స్పిరేషన్.

కమర్షియల్‌ సినిమాలకు ఓ పద్ధతి ఉంటుందనే విషయం తెలిసిందే. అదే క్లైమాక్స్‌ ముందు మాస్‌ గీతం ఉండటం. దానికి భిన్నంగా దర్శకుడు కృష్ణవంశీ క్లాసిక్‌ సాంగ్‌ ‘అలనాటి రామచంద్రుడి’ని పెట్టాలనుకున్నారు. కానీ, అందరూ వద్దని సూచించారట. మహేష్‌ ఇదే అనుకున్నా.. దర్శకుడికి చెప్పలేకపోయాడు. ఈ విషయం కాస్త కృష్ణ దగ్గరకు వెళ్లింది. ‘‘చివర్లో మాస్‌ సాంగ్‌ ఉండకపోవడం సరైంది కాదు. అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు’’ అని కృష్ణ సమాధానమిచ్చారు.

‘‘ఇప్పుడు మనకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి.. ఈ క్లాస్‌ సాంగ్‌తో నన్ను సినిమా పూర్తి చేయించడం. రెండు.. ఈ చిత్రాన్ని వదిలేసి వెళ్లిపోవడం. మీరు కమర్షియల్‌ సాంగ్‌తో విడుదల చేసుకోండి. నా పేరు కూడా వేయొద్దు. ఎందుకంటే నేను చేసే ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది. మీ అబ్బాయి కెరీర్‌కు కావాలంటే పెట్టుకోండి. నేను వెళ్లిపోతా’ అని కృష్ణవంశీ అనడంతో కృష్ణ ఒప్పుకొన్నారు. సినిమా థియేటర్లకు వచ్చాక ఆ పాట గురించి ఎంతోమంది ప్రశంసల జల్లు కురింపించారు.

కృష్ణవంశీ ఏది అడిగినా అరేంజ్ చేయమని ప్రొడక్షన్ టీమ్‌కి ఆర్డరేశాడు రామలింగేశ్వరరావు. దాంతో కృష్ణవంశీ టెన్షన్ లేకుండా సినిమా కంప్లీట్ చేయగలిగాడు. 2001 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అయ్యింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో ఫస్ట్ కాపీ రెడీ. కొంత ఎడిట్ చేద్దామంటే కృష్ణవంశీ వినలేదు. తనకి ఒకటే నమ్మకం. ఇలాంటివి మళ్లీ మళ్లీ తీయలేం. మొదట డివైడ్ టాక్ వచ్చినా, సూపర్‌హిట్ కావడం ఖాయం.

ఫిబ్రవరి 16న రిలీజ్. డివైడ్ టాక్. లెంగ్త్ ఎక్కువైందని కంప్లయింట్స్. డిస్ట్రిబ్యూటర్లు కటింగ్స్ మొదలుపెట్టారు. కృష్ణవంశీ కయ్‌మంటున్నాడు. కృష్ణ గారు సినిమా చూసి కదిలిపోయారు. మహేష్ పర్‌ఫార్మెన్స్ చూసి గర్వపడుతున్నాను అంటూ స్టేట్‌మెంట్. మహేష్ ఫుల్ హ్యాపీ! మురారి రిలీజ్ టైమ్‌కి హిందీ సినిమా శక్తి (తెలుగు అంతఃపురంకి రీమేక్) షూటింగ్ కోసం ఎక్కడో నార్త్‌లో ఫోన్లు కూడా పనిచేయని చోట ఉన్నాడు కృష్ణవంశీ.

వాళ్ల బ్రదర్ రెండ్రోజులు ట్రై చేస్తే, ఫోన్‌లో దొరికాడు. థాంక్స్ రా అన్నాడు కృష్ణవంశీ. నేనింకా కంగ్రాట్స్ చెప్పలేదన్నయ్యా! అన్నాడు తమ్ముడు. నువ్వు అది చెప్పడానికే ఫోన్ చేశావని నాకు తెలుసు అని నవ్వేశాడు కృష్ణవంశీ. సంకల్పం ఓ కల్పవృక్షం. మనం బలంగా ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. నమ్మకం ఓ ఐరావతం. మనల్ని ఎంత దూరాలకైనా మోసుకెళ్తుంది! ఇవీ మురారి మనకు చెప్పే జీవిత సత్యాలు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus