Jagapathi Babu: 27 ఏళ్ళ ‘ఆయనకి ఇద్దరు’ మూవీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

  • July 7, 2022 / 08:16 PM IST

ఇప్పుడంటే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయాడు కానీ.. గతంలోకి వెళ్తే జగపతి బాబు కూడా సెమీ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున వంటి హీరోల సినిమాల పక్కన చప్పుడు చేయకుండా వచ్చి మరీ బ్లాక్ బస్టర్లు కొట్టేవి జగపతి బాబు నటించిన సినిమాలు. ముఖ్యంగా శోభన్ బాబు తర్వాత శోభన్ బాబు… అనే గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని ఇమేజ్ ని సంపాదించుకున్నాడు జగపతి బాబు.

స్టార్ హీరోల సినిమాలు అప్పుడప్పుడు వస్తే.. జగపతి బాబు సినిమాలు మాత్రమే 3 నెలలకి ఒకటి అన్నట్టు రిలీజ్ అయ్యి ఉండేవి. ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు ఖాళీగా ఉండకుండా సినిమాలు చేసి క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడైతే చాలా మంది మిడ్ రేంజ్ హీరోలు ఉన్నారు. కానీ అప్పట్లో జగపతి బాబు ఒక్కడే క్రేజ్ ఉన్న మిడ్ రేంజ్ టు సెమి స్టార్ హీరో కాబట్టి.. దర్శక నిర్మాతలు ఎగబడి అతనితో సినిమాలు చేసేవారు.

అయితే 1994 వ సంవత్సరంలో వచ్చిన ‘శుభలగ్నం’ తర్వాత జగపతి బాబు నటించిన ‘తీర్పు’ ‘చిలకపచ్చ కాపురం’ ‘భలే బుల్లోడు’ ‘సంకల్పం’ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. ఆ టైంలో జగపతి బాబు పనైపోయింది అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే 1995 లో వచ్చిన ‘ఆయనకి ఇద్దరు’ సినిమా జగపతి బాబు ప్లాప్ లకు బ్రేకులు వేసింది.ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 27 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం :

1) అప్పటి స్టార్ డైరెక్టర్ ఇ. వి. వి. సత్యనారాయణ తెరకెక్కించిన మూవీ ఇది. జగపతి బాబు సరసన రమ్యకృష్ణ, ఊహ హీరోయిన్లుగా నటించారు.

2) 1993 వ సంవత్సరంలో వచ్చిన జాకీ ష్రాఫ్ హీరోగా, అమృతా సింగ్, జూహీ చావ్లా ల… ‘ఐనా’ అనే బాలీవుడ్ మూవీలో మెయిన్ పాయింట్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అమృతా సింగ్ ఆ చిత్రంలో నెగిటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినందుకు గాను ఆమె కు ఫిలిం ఫేర్ అవార్డు లభించింది.

3) జాకీ ష్రాఫ్ పాత్రలో జగపతిబాబు.. అమృతా సింగ్ పాత్రలో రమ్యకృష్ణ, జూహీ చావ్లా పాత్రలో ఊహ.. వంటి వారితో ‘ఆయనకి ఇద్దరు’ తెరకెక్కింది.

4) ఒరిజినల్ కు ఈ చిత్రానికి అస్సలు సంబంధం ఉండదు. దర్శకుడు ఇ. వి. వి. సత్యనారాయణ గారు ప్రతి ఫ్రేమ్ ను తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేశారు.

5) అయితే ఈ చిత్రం విడుదల టైం లో ‘ఆయనకి ఇద్దరు’ అనే టైటిల్ పెట్టినందుకు గాను పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. మహిళా సంఘాల వారు అయితే ఆ టైటిల్ ని మార్చాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఇ. వి. వి గారు తెరకెక్కించిన ‘అల్లుడా మజాకా’ చిత్రానికి కూడా అదే విధంగా మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి.

6) ఓ క్రమంలో ఇ. వి. వి గారు టైటిల్ ను మార్చేద్దాం అనుకుని ‘ఆయనకి ఇద్దరా’ అంటూ అనౌన్స్ చేశారు. కానీ తర్వాత పరిస్థితులు చక్కబడడంతో మొదటి టైటిల్ పెట్టుకున్నారు. నిజానికి ఆ టైటిల్ వల్లే సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.

7) 1995 వ సంవత్సరం జూలై 7 న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

8) జగపతి బాబు, రమ్య కృష్ణ లు పోటీపడి మరీ నటించారు. రమ్యకృష్ణ నెగిటివ్ రోల్స్ పోషించడం ఈ సినిమా నుండే మొదలైంది. ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. సవతి తల్లిని అసహ్యించుకుని, ఆమె కూతురుని కూడా తక్కువ చేసి చూసే అమ్మాయిగా ఈమె నటన ప్రతీ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా కారణంగా రమ్యకృష్ణని తిట్టుకున్న వారు కూడా ఆ టైంలో చాలా మందే ఉన్నారు. అంత బాగా ఆమె నటించింది.

9) ‘శ్రీ తులసి అన్నపూర్ణ క్రియేషన్స్’ బ్యానర్ పై కంటిపూడి సత్యనారాయణ, సి.హెచ్. సత్యనారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

10) కోటి అందించిన సంగీతం, బ్రహ్మానందం- కోటా శ్రీనివాస్- ఎ.వి.ఎస్ కాంబినేషన్లో వచ్చే అప్పు కామెడీ ట్రాక్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. మాస్ ఏరియాల్లో కూడా ఈ మూవీ అద్భుతంగా కలెక్ట్ చేయడానికి అదొక కారణంగా చెప్పుకోవాలి. అదే ఏడాది ఇ. వి. వి గారికి రెండు బ్లాక్ బస్టర్లు దక్కాయి, జగపతి బాబు ఫ్లాప్స్ నుండి బయటపడ్డాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus