సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు ప్రమోషన్లు వేగవంతం చేయాల్సిన బాధ్యత దర్శకనిర్మాతల పై ఉంటుంది. అలాగే ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొని సినిమాకు కావాల్సిన బజ్ ను రాబట్టాల్సిన బాధ్యత హీరో, హీరోయిన్ల పై కచ్చితంగా ఉంటుంది. మరి వారు డిమాండ్ చేసిన పారితోషికాలు, కార్ వ్యాన్ ఖర్చులు, మేకప్ మెన్ ఖర్చులు.. దర్శకనిర్మాతలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లకపోతే ఎలా. మన దగ్గర అయితే దర్శక నిర్మాతలు హీరో, హీరోయిన్లను బ్రతిమాలుతూ ఉంటారు. కానీ నటి ప్రమోషన్లకు రావడం లేదని ఏకంగా కేసు వేసేసింది ఉపాసన.
ఇక్కడ ఉపాసన అనగానే రాంచరణ్ సతీమణి అనుకోకండి.. ఈ ఉపాసన వేరు..! ఈమె ఓ పంజాబ్ నటి కమ్ నిర్మాత. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ కు చెందిన మోడల్ అయిన హర్నాజ్ సంధు.. 2021 కి గాను మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. సంధు ఈ ఘనత సాధించక ముందు నుండే సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమె ‘సంతోష్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ‘బై జీ కుట్టంగే’ అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది.
ఈ చిత్రాన్ని పంజాబ్ నటి ఉపాసన నిర్మించారు. అయితే ‘బై జీ కుట్టంగే’ చిత్రం ప్రమోషన్లకు హర్నాజ్ సంధు రావడం లేదట. ఈ విషయం పై ఉపాసన కేసు వేసి ఆమెకు లీగల్ నోటీసులు పంపింది. ఈ విషయం పై ఉపాసన స్పందిస్తూ.. “బై జీ కుట్టంగే’లో హర్నాజ్ సంధు తో పాటు దేవ్ ఖరౌద్ గురుప్రీత్ ఘగీ నటించారు. ఈ సినిమాకు సమీప్ కాంగ్ డైరెక్ట్ చేశారు.
సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్ కోసం వ్యక్తిగతంగా, వర్చువల్ గా అందుబాటులో ఉండాలని నేను హర్నాజ్ సంధు కి తెలిపాను. నిజానికి ఈ చిత్రం మే 27న విడుదల కావాలి. కానీ ఆమె వల్లే ఆగస్టు 19 కి వాయిదా వేశాం. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం డేట్స్ ఇవ్వమని అడిగితే ఆమె నొ చెబుతుంది” అంటూ ఉపాసన ఛండీగడ్ కోర్టులో దావా వేశారు. నాకు ఆమె నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో కోరినట్టు తెలుస్తోంది.