ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నట్లు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2019లో అనౌన్స్ చేశారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వర్మ ఎప్పుడూ చెబుతుంటారు. అయితే ఈ సిరీస్ ప్రకటించిన తరువాత వర్మ ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని బయటకి తీశారు. ఈ సిరీస్ పై తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.
ప్రపంచంలో భయంకరమైన సంస్థగా దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడో చెప్పే నిజమైన కథను ఈ సిరీస్ ద్వారా చూపించబోతున్నట్లు చెప్పారు. తన లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ను స్పార్క్ కంపెనీ అధినేత సాగర్ నిర్మిస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పటికే దావూద్ ఇబ్రహీంపై వర్మ ఒక సినిమా తీశారు. 2002లో దావూద్ జీవితం ఆధారంగా ‘కంపెనీ’ అనే సినిమాను రూపొందించారు వర్మ.
ఇందులో అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్, ఊర్మిళ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ ఈ సినిమాతో తనకు తృప్తి కలగలేదని వర్మ గతంలో చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా వర్మ.. దావూద్ కి సంబంధించిన చాలా సమాచారం సేకరించారు. ఇప్పుడు దాన్ని సిరీస్ గా రూపొందించాలని నిర్ణయించుకున్నారు.