మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఉప్పెన’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.50 కోట్లకు పైనే షేర్ ను నమోదు చేసి డెబ్యూ హీరోల సినిమాల్లో రికార్డు సృష్టించింది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించారు.
2021లో ఇప్పటి వరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టింది కూడా ఈ చిత్రమే కావడం విశేషం. ఇక వైష్ణవ్ తేజ్ తరువాతి చిత్రాలకు రూ.5 కోట్ల వరకూ పారితోషికం ఇస్తామని నిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ‘ఉప్పెన’ చిత్రానికి మొదట వైష్ణవ్ తేజ్ ను హీరోగా అనుకోలేదట. నిజానికి ‘ఉప్పెన’ కు ఫస్ట్ ఛాయిస్ గా విజయ్ దేవరకొండను అనుకున్నాడట బుచ్చిబాబు. 2017 లోనే విజయ్ తో ఈ సినిమాని చేద్దాం అనుకున్నాడట.
కానీ ఇంతలోపే ‘అర్జున్ రెడ్డి’ విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడం.. విజయ్ కు స్టార్ ఇమేజ్ ఏర్పడడంతో అతను వెనక్కి తగ్గాడట. ‘అర్జున్ రెడ్డి’ లో విజయ్ లానే… మంచి నటన కనపరిచే కొత్త హీరోతో ఈ సినిమా చెయ్యాలి అనుకున్నాడట. తరువాత సోషల్ మీడియాలో వైష్ణవ్ తేజ్ ఫోటోలు చూసి… తన కథకి ఇతనైతేనే కరెక్ట్ అని భావించి అతన్ని సంప్రదించి ఓకే చేయించుకున్నట్టు తెలుస్తుంది. అలా ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ చెయ్యడం… అది సూపర్ సక్సెస్ సాధించడం జరిగింది.