కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుండి తెలంగాణలో థియేటర్లన్నింటినీ కూడా మూసివేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో ‘వకీల్ సాబ్’ సినిమాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ వారాంతం వరకు ‘వకీల్ సాబ్’కు మినహాయింపు లభించింది. వచ్చే సోమవారం నుండి ఈ సినిమాను కూడా ఎత్తేస్తారు. అయితే కొంతమంది థియేటర్ యజమానులు ‘వకీల్ సాబ్’ సినిమాకు మినహాయింపు అక్కర్లేదని అంటున్నారు.
ఈరోజు నుండి ‘వకీల్ సాబ్’ సినిమాను ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లను కూడా మూసేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాకు గత వారం రోజులుగా సరైన ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. ఉగాది రోజు మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ జనాలు కనిపించలేదు. దీంతో తమకు ఎలాంటి మినహాయింపులు వద్దంటూ ఈరోజు నుండి ‘వకీల్ సాబ్’ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లను కూడా కొన్నింటిని మూసేస్తున్నారు. వీటిలో కొన్ని మల్టీప్లెక్స్ లు కూడా ఉన్నాయి.
‘వకీల్ సాబ్’ సినిమాకు హైదరాబాద్ లో అత్తాపూర్ లో ఉన్న ఓ మల్టీప్లెక్స్ కి నిన్న కేవలం ఇరవై మంది ప్రేక్షకులు వచ్చారు. అలానే సిటీ సెంటర్ లో ఉన్న మరో మల్టీప్లెక్స్ కి పాతిక మంది ప్రేక్షకులు వస్తే.. షోని రద్దు చేసేసారు. ఇంత తక్కువ ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేస్తే కరెంట్ బిల్లులు కూడా కట్టలేమని అంటున్నారు యజమానులు. అందుకే ఈరోజు నుండి ఒకట్రెండు తప్ప మిగిలిన అన్ని థియేటర్లను బంద్ చేశారు.