Varudu Kaavalenu Review: వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

నాగశౌర్య-రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “వరుడు కావలెను”. ఇప్పటివరకూ విడుదలైన పాటలు, టీజర్ & ట్రైలర్ ప్రేక్షకులకు మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక సినిమా ప్రమోషన్స్ లో పూజా హెగ్డే, అల్లు అర్జున్ లు ఇన్వాల్వ్ అవ్వడం సినిమాకి మరింత బూస్ట్ ఇచ్చింది. మరి ఈ ప్రమోషన్స్ & కంటెంట్ ప్రేక్షకుల మెప్పు పొందగలిగిందా లేదా? అనేది చూద్దాం..!!

కథ: భూమి (రీతువర్మ) ఓ ప్రవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. స్ట్రాంగ్ ఇండిపెండింట్ ఉమెన్ అనే పదానికి సరైన నిదర్శనం భూమి. అటువంటి అమ్మాయి పెళ్లికి మాత్రం ఎందుకో ఇంట్రెస్ట్ చూపించదు. అలాగని చేసుకోనని చెప్పదు. వాళ్ళ అమ్మ మాత్రం సంబంధాలు వెతుకుతూ పెళ్లికొడుకులను కలుస్తూ తన కూతురికి పెళ్లి చేయాలని పరితపిస్తుంటుంది. అప్పుడు ఎంటరవుతాడు ఆకాష్ (నాగశౌర్య). పెళ్లి చేసుకోవడం కోసం ఇండియాకి వచ్చిన ఆకాష్.. భూమి ఆఫీస్ లోనే జాయినవుతాడు. కోపిష్టి-ఇగోయిస్టు అయిన భూమిని ఆకాష్ తన ప్రేమతో ఎలా సాధించుకున్నాడు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రీరిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ చెప్పినట్లు.. ఈమధ్యకాలంలో సినిమా మొత్తం (పాటలు మినహా) హీరోయిన్ చీర కట్టుకొని కనిపించిన సినిమా ఇదేనేమో. భూమి పాత్రలో రీతూవర్మ ఒదిగిపోయింది. ఆమె నటన, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఎమోషనల్ సీన్స్ లోనూ చక్కని పరిణితి ప్రదర్శించింది రీతు.

నాగశౌర్య మరోసారి యూత్ ఫుల్ రోల్ లో అలరించాడు. శౌర్యకు టైలర్ మేడ్ రోల్ ఇది. చాలా ఈజ్ తో చేసాడు. ముఖ్యంగా శౌర్య-రీతుల కాంబినేషన్ & కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యాయి. యూత్ ను ఆకట్టుకొనే విధంగా ఇద్దరి మధ్య సన్నివేశాలున్నాయి.నదియా, జయప్రకాష్, వెన్నెలకిషోర్ ల పాత్రలు అలరిస్తాయి. ముఖ్యంగా శౌర్య-నదియా కాంబినేషన్ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. అలాగే సెంటిమెంటల్ గానూ ఆకట్టుకుంటాయి. వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదు.

సాంకేతికవర్గం పనితీరు: డైలాగ్ రైటర్ గణేష్ రావూరి డైలాగ్స్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. ఏ సినిమాకైనా నేపధ్య సంగీతమో, నటీనటుల హావభావాలో ప్రత్యేక అంశాలుగా నిలుస్తాయి. కానీ.. ఈ చిత్రానికి గణేష్ మాటలు హైలైట్. కొన్ని సన్నివేశాలు చాలా చప్పగా ఉన్నా మాటలు మాత్రం చురుగ్గా ఉంటాయి. అందువల్ల ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. రివ్యూ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు డైలాగ్ రైటర్ గా కొత్త ప్రయాణం మొదలెట్టిన గణేష్ రావూరికి మంచి భవిష్యత్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక డెబ్యూ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య విషయానికి వస్తే.. దర్శకురాలిగా, కథా రచయిత్రిగా కొన్ని చోట్ల తడబడినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం పాసయ్యింది. హీరోహీరోయిన్ల నడుమ ప్రేమ పుట్టే సందర్భాలు, సన్నివేశాలు మరీ పేలవంగా ఉన్నాయి. అలాగే.. సెకండాఫ్ లో వచ్చే కాలేజ్ ఎపిసోడ్ లో పట్టు లేదు. ఇవి మినహాయిస్తే.. ఒక చిన్న కథను, హీరోయిన్ క్యారెక్టర్ బేస్ చేసుకొని చక్కగా నడిపింది. మొదటి చిత్రంలో దొర్లిన చిన్నపాటి తప్పులను రెండో సినిమాతో సరిద్దిద్దుకొని పూర్తిస్థాయి సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.

వంశీ-విష్ణుశర్మ ల సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ పాటలు ఆహ్లాదభరితంగా ఉన్నాయి. ఈ ఇద్దరి పనితనానికి సితార ఎంటర్ టైన్మెంట్స్ రిచ్ ప్రొడక్షన్ డిజైన్ తోడవ్వడంతో “వరుడు కావలెను” క్వాలిటీ పరంగా అద్భుతమైన అవుట్ పుట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: చాలా సాదాసీదా కథతో తెరకెక్కిన సినిమా “వరుడు కావలెను”. కాలేజ్ ఎపిసోడ్ ను తప్పిస్తే.. శౌర్య-రీతుల కాంబినేషన్ & కెమిస్ట్రీ, నదియా, వెన్నెల కిషోర్ ల ఆరోగ్యవంతమైన హాస్యం, గణేష్ చురుకైన మాటలు కోసం సినిమాని హ్యాపీగా ఒకసారి థియేటర్లో చూడవచ్చు.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus