కరోనా థర్డ్ వేవ్ వల్ల మరోసారి టాలీవుడ్ స్టార్ హీరోల, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్ తేజ్ గని సినిమాను గతేడాది డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని భావించినా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదట రెండు రిలీజ్ డేట్లను ప్రకటించి తాజాగా ఈ సినిమాను మార్చి 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటక రాష్ట్రంలో మార్చి 17వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అయిన జేమ్స్ సినిమాను మాత్రమే ప్రదర్శించాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్లే ఆర్ఆర్ఆర్ మేకర్స్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారని తెలుస్తోంది. ఎక్కువసార్లు రిలీజ్ డేట్లను మార్చుకున్న మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచిందని కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా ఈ సినిమా గురించి కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు భీమ్లా నాయక్ సినిమాను కుదిరితే ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేస్తామని ఆ తేదీకి రిలీజ్ చేయడం సాధ్యం కాకపోతే ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. గని సినిమా కూడా ఆ సినిమాల బాటలో నడుస్తూ రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకోనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. భీమ్లా నాయక్ విడుదల కాకపోతే ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయాలని భీమ్లా నాయక్ విడుదలైతే మార్చి 4వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని గని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.
త్వరలో గని మేకర్స్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తే గని మేకర్స్ రిలీజ్ డేట్ గురించి అధికారక ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.