తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు, ఎవరూ చేయలేదు అన్నట్లుగా ‘విశ్వంభర’ సినిమా గురించి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం ఆ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పని చేస్తుండటమే. ఓ పాట కోసం యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పని చేశారు. దీంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ‘అవమానం’ జరిగింది అనేలా కామెంట్లు, ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అయితే చాలామంది హీరోల సినిమాలకు ఇలాంటివి జరిగాయి. ఆ మాట అటుంచితే ఆ సినిమా దర్శకుడు మల్లిడి వశిష్ఠ కూడా ఇదే మాట అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ సినిమా ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇటీవల స్పెషల్ సాంగ్ పూర్తి చేసి సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో వశిష్ఠ మాట్లాడుతూ కీరవాణిపై గత కొన్ని రోజులుగా వస్తున్న సోషల్ మీడియా థంబ్ నైల్స్ గురించి మాట్లాడారు. కీరవాణి ఇచ్చిన ట్యూన్ నచ్చకపోవడంతో భీమ్స్‌ను తీసుకున్నామనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు వశిష్ఠ
కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆస్కార్ విన్నర్ కీరవాణిని అవమానించారు.. అంటూ థంబ్ నైల్స్ క్రియేట్ చేసి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ఆ పాట అవసరమైన సమయంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా సంగీతం తుది పనుల్లో కీరవాణి బిజీగా ఉన్నారు. అందుకే ఆ పాట వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో చేయిద్దామని ఆయనే సలహా ఇచ్చారు. అదేంటి సర్ అని నేను అడిగితే ఇందులో తప్పేముంది? సినిమాలో పాటలను వేర్వేరుగా రాస్తారు కదా.. మ్యూజిక్ కూడా అంతే అన్నారు అని వశిష్ఠ చెప్పారు.
ఈ క్రమంలో తన మొదటి సినిమా ‘బింబిసార’కు కూడా చిరంతన్ భట్, కీరవాణి కలసి పని చేసిన విషయాన్ని వశిష్ఠ గుర్తు చేశారు. ఇక పుకార్లు వచ్చినట్లు స్పెషల్ సాంగ్.. ఏ పాటకూ రీమిక్స్ కాదు. కొత్త ట్యూనే అని క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ ఎప్పుడు అని అడిగితే.. తేదీలు, పండగలు చూసుకొని చిరంజీవి సినిమా రాదని, ఆయన సినిమా వచ్చినప్పుడే పండగ అని చెప్పారు దర్శకుడు.