ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేస్తే.. ఆ వ్యక్తి కొన్ని ఏళ్లకు డైరక్టర్ అవ్వడం ఖాయం అని అంటుంటారు టాలీవుడ్‌లో. దీని కోసం సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ కూడా పెట్టారు సుకుమార్. ఇప్పటికే ఇలా చాలామంది వచ్చారు కూడా. ఇప్పుడు మరో టీమ్ మెంబర్ దర్శకుడు అవ్వబోతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంక్రాంతికి ముందే ఈ సినిమా కొబ్బరికాయ కొట్టుకోబోతోంది అని సమాచారం. ఈ సినిమాలో హీరోగా రాయలసీమ బిడ్డ కిరణ్ అబ్బవరం నటిస్తున్నాడట.
సుకుమార్ దగ్గర నుండి ఇప్పటివరకు దర్శకులుగా మారిన టీమ్ మెంబర్స్ చూస్తే.. బుచ్చిబాబు సానా (ఉప్పెన, పెద్ది), పల్నాటి సూర్యప్రతాప్ (కరెంట్, కుమారి 21 ఎఫ్, 18 పేజెస్ ), శ్రీకాంత్ ఓదెల (దసరా, ప్యారెడైజ్, చిరంజీవి సినిమా), అర్జున్ వైకే (ప్రసన్న వదనం), వేమారెడ్డి (చక్కిలిగింత), కార్తిక్ దండు (విరూపాక్ష) కనిపిస్తారు. ఇప్పుడు ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలకు సుకుమార్ దగ్గర రచనా విభాగంలో కీలక పాత్ర పోషించిన వీరాంజనేయులు కోగటం అలియాస్ వీరా కొగటం కూడా ఇలానే డైరక్టర్ అవ్వబోతున్నారట.
ప్రేమ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను మేళవించి వీరా కొగటం ఓ కథ రాసుకున్నారట. దానికి సుకుమార్ పచ్చ జెండా ఊపి.. నిర్మాణ భాగస్వామిని కూడా అవ్వాలని ఫిక్స్ అయ్యారట. మరో యువ నిర్మాతతో కలసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారట. కర్నూలు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారట. త్వరలోనే సినిమా అనౌన్స్ చేస్తారట. అప్పుడు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ‘కే రాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం బిజీగా ఉన్నారు. ఆ సినిమాల తర్వాతే వీరా సినిమా ఉంటుందట.
‘పుష్ప’ సినిమాల్లో ఆ ప్రాంతం ఫ్లేవర్, యాస స్పెషలిస్ట్‌గా వీరా కొగటం పని చేశారు. తిరుపతి యాస, భాషలోనే ఆ సినిమా నడిచింది. సీమ టచ్ మిస్ అవ్వకుండా ఉండటానికి వీరా చాలా కృష్టి చేశారు అని దర్శకుడు సుకుమారే చెప్పారు. ఇప్పుడు ఆయన డైరక్షన్ డెబ్యూ ఎలా ఉండబోతుందో చూడాలి.