Veeranjaneyulu Vihara Yatra Review in Telugu: వీరాంజనేయులు విహారయాత్ర సినిమా రివ్యూ & రేటింగ్!
August 14, 2024 / 02:02 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
రాగ్ మయూర్ (Hero)
ప్రియా వడ్లమాని (Heroine)
నరేష్, శ్రీ లక్ష్మి , ప్రియదర్శిని, తరుణ, రవితేజ మహా దాస్యం తదితరులు (Cast)
అనురాగ్ పాలుట్ల (Director)
బాపినీడు - బి, సుధీర్ ఈదర (Producer)
ఆర్.హెచ్ విక్రమ్ (Music)
అంకుర్ సి (Cinematography)
Release Date : ఆగస్టు 14, 2024
సీనియర్ నటుడు నరేష్ (Naresh) ఎలాంటి పాత్ర చేసినా దానికి వందకి వంద శాతం న్యాయం చేస్తుంటారు. అందుకే యువ దర్శకులు ఆయన కోసం మంచి మంచి పాత్రలు డిజైన్ చేస్తూ వస్తున్నారు. ఓటీటీల కోసం కూడా మంచి మంచి కంటెంట్ చేస్తూ వస్తున్నారు నరేష్. ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన మరో ఓటీటీ మూవీ ‘వీరాంజనేయులు విహార యాత్ర’ (Veeranjaneyulu Vihara Yatra) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రండి :
కథ : వీరాంజనేయులు(బ్రహ్మానందం) (Brahmanandam) రైల్వే ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. అతను రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో గోవాలో ఓ ఇల్లు కొంటాడు. 1962 టైంలో కాబట్టి.. అతనికి అది ఈజీగానే లభిస్తుంది. ఆ ఇంటికి హ్యాపీ హోమ్ అనే పేరుపెడతాడు. ఆ తర్వాత ఆయన కాలం చేయగా.. కుటుంబ బాధ్యత ఆయన కొడుకు నాగేశ్వరరావు పై పడుతుంది. అతను వైజాగ్లోని ఓ స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే అతను ప్రైవేటు స్కూల్లో పనిచేయడం వల్ల.. ఇంగ్లీష్ మీడియంని ప్రవేశ పెట్టడం.. ఇతనికి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వల్ల.. స్కూల్ యాజమాన్యం ఇతన్ని ఉద్యోగం నుండి తీసేస్తుంది. ఇదే టైంలో ఆమె కూతురు సరయు(ప్రియా వడ్లమాని) (Priya Vadlamani) ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది.
ఆమె పెళ్ళికి డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది నాగేశ్వరరావుకి అర్థం కాదు. మరోపక్క అతని కొడుకు వీరు(రాగ్ మయూర్) (Rag Mayur) ఉద్యోగం మానేసి, ఓ స్టార్టప్ పనులు మొదలుపెడతాడు. వీరు ఉద్యోగం మానేసిన విషయం నాగేశ్వరరావుకి తెలీదు. అయినప్పటికీ కూతురి పెళ్లి గ్రాండ్ గా చేయాలని ఆమెకు కాబోయే అత్తింటి వారు కండిషన్ పెట్టడంతో.. నాగేశ్వరరావు తన తల్లికి(శ్రీలక్ష్మీ) (Sri Lakshmi) తెలియకుండా గోవాలో ఉన్న హ్యాపీ హోమ్ ను అమ్మేయాలని ప్లాన్ చేస్తాడు.ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : నరేష్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఎలాంటి పాత్రకైనా జీవం పోస్తారు. నాగేశ్వరరావు పాత్రలో కూడా ఆయన ఒదిగిపోయారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండించిన ఆయన సెకండ్ హాఫ్లో.. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఓ నిస్సహాయ తండ్రిగా ఆయన పలికించిన హావభావాలు అందరినీ హత్తుకుంటాయి. అతని తర్వాత ఆ రేంజ్లో పెర్ఫార్మ్ చేసింది ఆమె తల్లి పాత్ర చేసిన శ్రీలక్ష్మి అనే చెప్పాలి. ఆమె కూడా మొదటి నుండి కామెడీ చేసి చివర్లో కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఇక ప్రియా వడ్లమాని గత సినిమాల్లో మోడరన్ గా కనిపించినప్పటికీ.. ఈ సినిమాలో కొంత బాధ్యత తెలిసిన కూతురిగా కనిపించి నటిగా ఇంప్రూవ్ అయ్యింది. రాగ్ మయూర్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో పర్వాలేదు అనిపించాడు. హర్షవర్ధన్ ఫ్రాడ్ డాక్టర్ గా కనిపించి కాసేపు నవ్వించాడు. మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు అనురాగ్ పాలుట్ల చిన్న పాయింట్ ను తీసుకుని ఎంగేజింగ్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.లాజిక్స్ విషయంలో ఇతను తీసుకున్న శ్రద్ధ బాగుంది. ఇతను డిజైన్ చేసిన ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్క్ ఉంటుంది. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంటనే ఆ పాత్రకి కనెక్ట్ అవ్వగలుగుతారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా నడిపించాడు. కొన్ని చోట్ల స్లో అనిపించినా ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టదు. అయితే సెకండాఫ్ కూడా అదే విధంగా ఎంటర్టైనింగ్ గా సాగుతుందేమో అనుకుంటే, దాన్ని పూర్తిగా ఎమోషనల్ గా నడిపించాడు.
అందువల్ల ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంత ల్యాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ ఇది ఓటీటీ సినిమా కాబట్టి.. ‘పర్వాలేదులే..’ అనుకుంటూ పాస్ మార్కులు పడిపోతాయి.సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టు బాగానే ఉన్నాయి.
విశ్లేషణ : ‘వీరాంజనేయులు విహార యాత్ర’ (Veeranjaneyulu Vihara Yatra) ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలగలిపిన ఓ టైంపాస్ ఓటీటీ మూవీ. సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించినప్పటికీ .. ఓటీటీ మూవీ కాబట్టి ఈ వీకెండ్ కి ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.