ఏదైనా సినిమా ఫలితం తేడా కొడితే చాలా వేళ్లు దర్శకుడు వైపే ఉంటాయి. కారణమేంటో తెలియదు కానీ.. కొత్త దర్శకుడు నుండది పాత దర్శకుడు వరకు ఎవరికైనా ఈ పరిస్థితి తప్పనిసరి. అలాంటి సమయంలో కొంతమంది దర్శకుడు తప్పు మాది కాదు అని ఇతరుల మీదకో, ఇతర అంశాల మీదకో నెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ఆలోచనతో అంటున్నారో లేక వేరే ఆలోచనో తెలియదు కానీ.. దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) మాటలు అలానే అనిపిస్తున్నాయి.
Venkat Prabhu
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) – వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ది గోట్’(The Greatest of All Time) . ఇటీవల ఈ సినిమా విడుదలైంది. తమిళనాడులో మంచి విజయాన్ని అందుకుందని వార్తలొస్తున్నాయి. అయితే తెలుగు తదితర భాషల్లో సినిమాకు ఆశించిన స్పందన లేదు. అయితే దీనికి వెంకట్ ప్రభు వాదన వింటే విచిత్రంగా అనిపిస్తోంది. దానికి కారణం ఆయన సినిమా ఫలితానికి చెన్నై సూపర్ కింగ్స్‌కి, మహేంద్ర సింగ్ ధోనీకి లింక్ చేశారు.
‘ది గోట్’ సినిమాలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) తరహాలో చాలా అతిథి పాత్రలు ఉన్న విషయం తెలిసిందే. అలా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కూడా చూపించారు. ఐపీఎల్ విజువల్స్ చూపించడం ద్వారా ఆయన్ని సినిమాలో భాగం చేశారు. అయితే ధోనీని అలా హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని వెంకట్ ప్రభు (Venkat Prabhu) అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు, బాలీవుడ్‌లో సినిమా ఫలితానికి ఇదే కారణమని చెబుతున్నారు.
అయితే, మహేంద్ర సింగ్ ధోనీకి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానం చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా వచ్చింది కాదు అనే విషయం వెంకట్‌ప్రభు మరచిపోయినట్లున్నారు. ఆయన ఇండియన్ స్టార్ అయ్యాకనే చెన్నై ఐపీఎల్ టీమ్‌కి ఆడారు. అందుకే చెన్నై మ్యాచ్ దేశంలో ఎక్కడ జరిగినా క్రికెట్ అభిమానులు ధోనీ ఫ్యాన్స్‌గా మారిపోతారు. అలాంటిది సినిమా ఫలితానికి ధోనీ అభిమానాన్ని అడ్డుగా పెట్టడం సరికాదు.