తెలుగులో ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి.. రీసెంట్ గా ‘సార్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో తమిళ నటుడు ధనుష్ హీరోగా నటించారు. తెలుగు హీరోలు దొరకకపోవడం వలనో.. లేక ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ వారు చేయరనో కానీ తమిళ హీరో ధనుష్ దగ్గరకు వెళ్లారు దర్శకుడు వెంకీ అట్లూరి. ‘సార్’ కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో సినిమా హిట్ అయింది.
ఇప్పుడు మళ్లీ మరో సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయడానికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈసారి హీరో ఎవరనేది పాయింట్. మొదటి మూడు సినిమాలు తెలుగు హీరోలతోనే చేశారు వెంకీ అట్లూరి. వారంతా కూడా పేరున్న హీరోలే. ఇప్పుడు మళ్లీ తెలుగులో అదే రేంజ్ హీరోలతో చేయాలి. కానీ ప్రస్తుతం హీరోలెవరూ ఖాళీగా లేరు. అందుకే మళ్లీ తమిళ హీరో వైపు చూస్తున్నారట వెంకీ అట్లూరి. లేదూ అంటే.. మలయాళ హీరో అయినా ఓకే అనుకుంటున్నారట.
ఇలా చేయడం వలన బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మల్టీ లాంగ్వేజ్ సినిమా చేసినట్లు ఉంటుంది. అలానే అన్ని భాషల్లో తనకు మార్కెట్ కూడా వస్తుంది. పైగా వీలైనంత తక్కువ బడ్జెట్ లో వెంకీ అట్లూరి సినిమాలు తీస్తారు కాబట్టి నిర్మాతకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా పక్క భాషల్లో కాల్షీట్స్ అవైలబుల్ గా ఉన్న హీరో అయితే త్వరగా షూటింగ్ పూర్తి చేయొచ్చు. ‘సార్’ సినిమా ఇలానే జరిగింది.
మొత్తం సినిమాను అరవై కోట్ల రేంజ్ లో తీశారు. అందులో సగానికి పైగా రెమ్యునరేషన్స్ ఉన్నాయి. పాతిక కోట్లతో ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేశారు. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే నిర్మాతలు సేఫ్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయోగమే చేయబోతున్నారు. మరి ఈసారి వెంకీకి ఏ హీరో దొరుకుతారో చూడాలి!