సినిమాల వాయిదాలకు ఒకప్పుడు డబ్బు కారణంగా ఉండేది. ఆ తర్వాత నటుల డేట్స్ కుదరకపోవడం కారణంగా ఉండేది, ఆ తర్వాత రోజుల్లో డిస్ట్రిబ్యూషన్‌లో ఇబ్బందులు కారణంగా ఉండేవి. ఇప్పుడూ ఈ సమస్యలు కొన్ని ఉన్నాయి.. అయితే వీటి కంటే అతి ముఖ్యమైన అంశం ఒకటి కనిపిస్తోంది. సినిమాకు 25వ క్రాఫ్ట్‌గా అనధికారికంగా కొనసాగుతున్న ఈ అంశం.. ఇప్పుడు సినిమాల విడుదల విషయంలో, ఫలితం విషయంలో, ట్రోలింగ్ విషయంలో చాలా కీలకంగా మారింది. అదే వీఎఫ్‌ఎక్స్ అలియాస్ విజువల్ ఎఫెక్ట్స్.
గత కొన్నేళ్లుగా మన సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్ వినియోగం విరివిగా పెరిగిపోయింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వీఎఫ్‌ఎక్స్‌ను భారీగా వాడుతున్నారు. ఈ వారం విడుదలవుతున్న తేజ సజ్జా – కార్తిక్ ఘట్టమనేని – మంచు మనోజ్ – రితికా నాయక్ సినిమా ‘మిరాయ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ ‘కిష్కిందపురి’ కూడా వీఎఫ్‌ఎక్స్‌ను విరివిగా వాడిన సినిమాలే. వీటి ఫలితం కచ్చితంగా వీఎఫ్‌క్స్ మీదే ఆధారపడింది అని చెబుతున్నారు.
ఎందుకంటే మొన్నీమధ్య వచ్చిన ‘హరి హర వీరమల్లు’, ‘వార్ 2’, విషయంలో వీఎఫ్‌ఎక్స్ దెబ్బకొట్టి పరువు పోగొట్టుకున్నాయి. ఇక ఈ విషయంలోనే ఇబ్బందిపడి, ఇబ్బంది పడుతున్న చిరంజీవి – మల్లిడి వశిష్ట – త్రిష సినిమా ‘విశ్వంభర’ ఏకంగా వచ్చే ఏడాది సమ్మర్‌కి వెళ్లిపోయింది. ఇక దసరాకు ఫిక్స్ అని ఘంటాపథంగా చెప్పిన ‘అఖండ 2: తాండవం’ సినిమా వాయిదాకు కూడా ఈ వీఎఫ్ఎక్స్ అవ్వకపోవడమే కారణం అని చెబుతున్నారు.
వీఎఫ్‌ఎక్స్ సరిగ్గా లేకపోతే ఎంత మంచి కథ చెప్పినా, ఎంత బాగా తీసినా జనాలు ఆదరించడం లేదు. దానికి ఓ ఉదాహరణ ప్రభాస్ – ఓం రౌత్ ‘ఆదిపురుష్’. దీంతో నిర్మాతలు వీఎఫ్‌ఎక్స్ పెడితే ష్యూర్‌షాట్‌గా సూపర్‌గా ఉండేలా చూసుకోవాలి లేదంటే పెట్టొద్దు అని ఫిక్స్ అయ్యారు. ఇక వీఎఫ్‌ఎక్స్ పెద్దగా వాడని అనిల్ రావిపూడి లాంటి దర్శకులు అయితే ‘మా సినిమాలో ఒరిజినల్ షాట్‌లు 95 శాతం ఉన్నాయి’ అని కచ్చితంగా చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇది చాలదూ వీఎఫ్‌ఎక్స్ ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకున్నాయో టాలీవుడ్‌లో.