విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ‘విడుదల 2’(Vidudala Part 2). 2023లో విడుదలైన ‘విడుదల’ సినిమాకు సీక్వెల్ ఇది. దీంతో ‘విడుదల 2’ సినిమా మీద అభిమానులు పెట్టుకున్న ఆశలు నిలవలేదు. తొలి భాగం అందుకున్న స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 19వ తేదీ నుండి ‘విడుదల 2’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు ఆడియోల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే ‘విడుదల 1’ కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఓటీటీలో మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు రెండు భాగానికి కూడా అదే స్థాయిలో స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ‘విడుదల 2’ (Vidudala Part – 2) కథ గురించి చూస్తే.. కానిస్టేబుల్ కుమరేశన్ (సూరి) (Soori Muthusamy) ఇచ్చిన క్లూతో ప్రజాదళం నాయకుడు, నక్సల్ పెరుమాళ్ అలియాస్ మాస్టారు (విజయ్ సేతుపతి)ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ‘విడుదల 1’ సినిమాను ముగించారు.
రెండో సినిమాను అక్కడి నుండి స్టార్ట్ చేశారు. జమిందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాల్ని అడ్డుకునే క్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టార్ పెరుమాళ్ దళ నాయకుడిగా ఎలా మారాడు? అనేది చూపించారు. ఉద్యమ ప్రయాణంలో మహాలక్ష్మి (మంజు వారియర్)తో మాస్టారుకు మధ్య చిగురించిన ప్రేమ తనని ఏ వైపు నడిపించింది? అహింసను ఇష్టపడే పెరుమాళ్ తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలో నడిపించడానికి దారి తీసిన పరిస్థితులేంటి? అనేది కథ.
ఇక నీతి నిజాయతితో ఉద్యోగ ధర్మం నిర్వర్తించి పెరుమాళ్‌ను పట్టించినందుకు కానిస్టేబుల్ సూరికి ఎలాంటి ఫలితం దక్కింది? అనేది ‘విడుదల 2’ కథ సాగుతుంది. ఈ సినిమా ఫలితం తేడా కొట్టిన విజయ్ సేతుపతి పడ్డ కష్టానికి మంచి పేరే తెచ్చింది. మరిప్పుడు ఓటీటీలో చూసి ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.