పెళ్ళైన వెంటనే నయనతార-విఘ్నేశ్ శివన్ లు వివాదంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. జూన్ 9న పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాతి రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే ఈ దంపతులు ఆలయ ప్రాంగణంలో చెప్పులతో తిరగడం భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చెప్పులేసుకుని తిరగడంతో ఈ దంపతులను కవర్ చేయడానికి వచ్చిన కెమెరామెన్ లు దేనినే హైలెట్ గా చిత్రీకరించారు.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ జంట వ్యవహరించారు అని ప్రతీ ఒక్కరూ మండిపడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు వాళ్ళని దారుణంగా ట్రోల్ చేశారు. ఈ విషయం పై తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) సైతం మండిపడుతూ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో నయన్ భర్త విగ్నేష్ క్షమాపణలు కోరుతూ ఓ లేఖను విడుదల చేశారు.
విగ్నేష్ ఈ లేక ద్వారా స్పందిస్తూ.. ” ఆ టైములో మా కాళ్లకు చెప్పులు ఉన్నట్లు గుర్తించలేదు. దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. తెలియక జరిగిన పొరపాటు కాబట్టి అందరూ మన్నించాలని ప్రార్ధన. మాపెళ్లి తిరుమలలో జరగాలని కోరుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. చెన్నైలో మా వివాహం జరిగింది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో పెళ్లి తర్వాత మా ఇంటికి కూడా వెళ్లకుండా మండపం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లడం జరిగింది.
స్వామి వారి కల్యాణోత్సవం సేవలో పాల్గొని ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం. శుక్రవారం దర్శనం అనంతరం మా పెళ్లి తిరుమలలో పూర్తయినట్లు అనిపించేలా ఫోటో తీసుకోవాలి అని అనుకున్నాం. కానీ ఆ టైములో ఆలయ ప్రాంగణంలో భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి నుండి వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చాము. వెంటనే ఫోటోషూట్ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళ్ళకి చెప్పులు ఉన్న సంగతి గమనించుకోలేదు.
ఇందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం. మా పెళ్లి ఏర్పాటు కోసం గత 30 రోజుల్లో ఐదుసార్లు తిరుమల వెళ్లడం జరిగింది. కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు. మేము ఎంతగానో ఆరాధించే స్వామి వారి పై భక్తి లేకపోవడం కాదు. తెలియక జరిగిన ఈ పొరపాటుకి క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి క్షమించండి’ అంటూ విగ్నేష్ పేర్కొన్నాడు.