నెలాఖరుకు వస్తాం, మంథ్ లాస్ట్‌లో వస్తాం.. అంటూ చెబుతూ వస్తున్న ఓ సినిమా మరోసారి కొత్త నెలలో నెలాఖరును చూసుకోవాల్సి వస్తోంది అని అంటున్నారు. ఆ నెలాఖరు సినిమా పేరు ‘కింగ్డమ్’(Kingdom). అవును విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)– గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబినేషన్‌లో నాగవంశీ (Suryadevara Naga Vamsi) తెరకెక్కిస్తున్న సినిమా గురించే ఇదంతా. ఈ నెలాఖరుకు వస్తుంది అని గత కొన్ని రోజులు ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ తగిలినట్లు అయింది. మే 30న విడుదల అనుకుంటున్న ‘కింగ్డమ్’ సినిమాను వాయిదా వేస్తున్నారట.
కొత్త రిలీజ్ డేట్ కోసం ఆలోచనలు జరుగుతున్నాయట. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘కింగ్డమ్’. విజయ్‌కి వరుసగా పరాజయాలు, డిజాస్టర్లు వస్తున్నా నాగవంశీ ఎంతో నమ్మకంగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా అవుట్‌పుట్‌పై నమ్మకంగా ఉన్న టీమ్.. మే 30న విడుదల చేస్తామని చెప్పింది. ఆ మధ్య ఒకసారి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘నెలాఖరుకు’ రావడం పక్కా అని కూడా చెప్పారు. అయితే ఆ స్థాయిలో ప్రచారం లేకపోవడంతో సినిమా వాయిదా పడటం ఖాయమనుకున్నారంతా.
అనుకున్నట్లుగానే ఇప్పుడు సినిమా వాయిదా పడింది అని చెబుతు్నారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అయితే సినిమాను జులై ఆఖరున విడుదల చేయాలి అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లుగా ఫిక్స్ అయితే ఈ డేట్ ఈ సారి పక్కా అని అంటున్నారు. ఇక ఈ సినిమాను తొలుత మార్చి నెలాఖరు (28)న విడుదల చేస్తామని టీమ్ తొలుత చెప్పింది. అక్కడి నుండి ముఏ 30కి వచ్చింది. ఇప్పుడు జులై అంటున్నారు. అంతా ఓకే కానీ.. ఎందుకు వాయిదా పడుతుందో చెప్పలేదేంటి అనుకుంటున్నారా?
‘అందరి అంచనాలకు తగ్గట్టు సినిమా సిద్ధం చేయడానికి, మిమ్మల్ని అలరించడానికి, బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి టైమ్ పడుతుంది. ఈసారి మిమ్మల్ని నిరాశపరచం’ అని ఓ స్టీరియో టైప్ డైలాగ్ ఉంది కదా అది చెప్పే అవకాశం ఉంది. అంటే.. ఆ మధ్య నా సినిమా విషయంలో నన్ను బ్యాన్ చేయండి అని నిర్మాత నాగవంశీ అన్నారుగా.. మరి ఆ బ్యాన్ జరుగుతుందా లేదా అనేది తేలాలంటే జులై వరకు ఆగాల్సిందే.