వరుసగా మూడు హిట్స్ అందుకోవడంతో విజయ్ దేవరకొండపై భారీ క్రేజ్ నెలకొంది. అతను ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న “నోటా” సినిమా కోసం అందరూ ఎదురుచుస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 4 న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడేలా ఉంది. కారణం రాజకీయ నేపథ్యం కాబట్టి.. కొన్ని పార్టీలు అడ్డుకోవచ్చనే నిర్ణయానికి రావద్దు. ఈ వివాదం చిత్ర యూనిట్ సభ్యుల్లోనే నెలకొంది. ఈ సినిమాకి సంభాషణలను సమకూర్చిన శశాంక్ వెన్నెలకంటి, నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.
“నోటా’ తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు ఆనంద్ శంకర్ నాతో మాటలు రాయించుకున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో మాటల రచయితగా నాకు క్రెడిట్ ఇవ్వకుండా తన పేరు వేసుకున్నాడు. ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ కూడా నావే .. కానీ కథ .. స్క్రీన్ ప్లేతో పాటు మాటల క్రెడిట్ కూడా ఆనంద్ శంకర్ వేసుకున్నాడు. తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసినందుకు నాకు రావలసిన డబ్బులతో పాటు, క్రెడిట్ కూడా ఇవ్వాలి. అప్పటివరకూ ఈ సినిమాను విడుదల కాకుండా చూడాలి” అని అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్శకుడు మాటల రచయితకి క్రెడిట్ ఇస్తాడా? లేదా?… సమయానికి రిలీజ్ అవుతుందా? అనేది సస్పెన్స్ గా మారింది.