సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్నో గొప్ప చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా తమదైన రికార్డులు సృష్టించాయి. టాలీవుడ్ నెంబర్ వన్ మూవీ బాహుబలి 2 (Baahubali 2) సినిమా కూడా అద్భుతమైన వసూళ్లను సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. అయితే చైనాలో మాత్రం ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు వసూళ్లను సాధించలేకపోయింది. కేవలం రూ.80 కోట్లతో ఆ మార్కెట్‌లో టాప్ 10లో ఒక స్థానం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అదే వసూళ్లను విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన మహారాజా సినిమా అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది.
మహారాజా (Maharaja) సినిమా చైనాలో మూడువారాల క్రితం విడుదలై మొదట స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మెల్లమెల్లగా మంచి వసూళ్లను అందుకుంటోంది. తండ్రి, కూతురు ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా స్లో బర్నర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.82 కోట్లను వసూలు చేయగా, బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. ఓ చిన్న బడ్జెట్ చిత్రం కావడం, స్టార్ కాస్ట్ లేకపోయినా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం విశేషంగా మారింది.
ఈ చిత్రం విజయానికి కారణం సింపుల్ కాన్సెప్ట్‌తో ఎమోషనల్ కనెక్షన్‌ను అందించడమే. క్లైమాక్స్‌లో అందరూ ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే చైనా ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. విజువల్ గ్రాండియర్ అవసరం లేకుండా కథా బలం ఉంటే చైనా మార్కెట్‌లో కూడా విజయవంతం కావచ్చని ఈ సినిమా నిరూపిస్తోంది.
తమిళనాట విజయ్ సేతుపతి 50వ చిత్రంగా భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా (Maharaja), ఇతర దేశాల్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. చైనాలో అయితే ఇది ఊహించని స్థాయిలో పరుగులు పెడుతోంది. అంచనాల ప్రకారం, వచ్చే వారం చివరి వరకు ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ రన్ బలంగా కొనసాగితే, మహారాజా సినిమా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వసూళ్లను అందుకునే స్కోప్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.