సినిమాలు – రాజకీయాలు.. ఈ రెండూ కవల పిల్లలు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్నవాళ్లు అక్కడికెళ్తుంటారు. అక్కడున్నవాళ్లు ఇక్కడివాళ్లతో దగ్గర సంబంధాలు నెరపుతుంటారు. అందుకే సినిమాలు– పాలిటిక్స్ బాగా దగ్గర. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నవాళ్లకు ‘కళారంగానికి చేసిన కృషికి ఇస్తున్నాం’ అంటూ రాజ్యసభ సీట్లు కూడా ఇస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. అలా రీసెంట్‌గా సినిమాల నుండి అలా రాజ్యసభకు వెళ్లిన వ్యక్తి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. అయితే ఇప్పుడు ఆయనకు కాషాయ రంగు పులిమేస్తున్నారు.
విజయేంద్రప్రసాద్ రాసిన సినిమాల కథలు అన్నీ భారీగానే ఉంటాయి. ప్రతి సినిమాను లార్జర్ దేన్ లైఫ్‌గా రాస్తుంటారాయన. ఈ క్రమంలో చరిత్రలోని కొన్ని అంశాలను సినిమాల్లో చూపిస్తుంటారు. లేదంటే చరిత్రనే సినిమాగా రాస్తుంటారు. ‘మణికర్ణిక’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాలు అలా వచ్చినవే. అయితే ఆయన తాజాగా ఎంచుకున్న రెండు కథలు ఆయనకు కాషాయ రంగు పులిమేయడానికి కారణమయ్యాయి. విజయేంద్ర ప్రసాద్ చేతుల్లో ఇప్పుడున్న కథల్లో ‘1770’ ఒకటిగా, ఆర్‌ఎస్‌ఎస్ మీద ఆయన ఓ సినిమా కథ రాస్తున్నారని చెబుతున్నారు.
‘1770’ సినిమాకు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఆనందమఠ్ నవల ఆధారంగా.. ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు. శైలేంద్రకుమార్, సుజయ్ కుట్టి, కృష్ణకుమార్.బి, సూరజ్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌కి రాజ్యసభ సభ్యత్వం దక్కడానికి.. ఆయన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ప్రభావితుడు అవ్వడం, వారికి మద్దతుగా మాట్లాడటం ఓ కారణం అని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన ఇటీవల భాజపా నేత రామ్ మాధవ్ రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు కొన్నేళ్ల ముందు వరకు ఆర్ఎస్ఎస్ అంటే ఏమీ తెలియదని.. దాని మీద సినిమా చేయాలన్న ఉద్దేశంతో మోహన్ భగవత్ తనను పిలిచి మాట్లాడారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ గొప్పతనం అప్పుడే తెలిసిందని, మరింతగా పరిశోధన చేసి ఒక సినిమాతో పాటు, వెబ్ సిరీస్ కూడా చేయాలని నిర్ణయించుుకున్నట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఆయన కోరుకోకుండానే కాషాయ రంగు ఆయనకు అంటుకుంటుంది.